Telangana: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బు జమ..

తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్ల సాగు రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ పంపిణీని ప్రారంభించింది. రూ.649.84 కోట్లు విడుదల చేయగా, 24 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే లక్షల మంది ఖాతాల్లో నగదు జమ అయింది. అర్హతగల రైతులు బోనస్ అందకపోతే ఏం చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana: రైతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. అకౌంట్లలో డబ్బు జమ..
Telangana Fine Rice Bonus

Edited By:

Updated on: Dec 20, 2025 | 9:24 AM

తెలంగాణ ప్రభుత్వం రైతన్నల ఆదాయం పెంపుదల లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన సన్న వడ్ల బోనస్ పంపిణీని ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది రైతులు నేరుగా లబ్ధి పొందనున్నారు. సన్న రకాలు సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధరకి అదనంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్ చెల్లించేందుకు ప్రభుత్వం రూ.649.84 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇప్పటికే నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు స్పష్టం చేశారు.

తొలి రోజే లక్షల ఖాతాల్లో నగదు జమ

శుక్రవారం ఒక్క రోజే 2,49,406 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో బోనస్ మొత్తం జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. అదే రోజుకు 11.45 లక్షల మంది రైతులు 59.74 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినట్లు తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖల సమన్వయంతో ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇంకా నగదు జమ కాని రైతుల ఖాతాల్లో సోమవారం నుంచి మిగిలిన మొత్తం జమ కానుంది.

ఎవరికెవరికీ బోనస్ వర్తిస్తుంది?

ప్రభుత్వం నిర్దేశించిన 33 రకాల సన్న బియ్యం రకాలను సాగు చేసి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు మాత్రమే ఈ బోనస్ వర్తిస్తుంది. ధాన్యంలో తేమ శాతం, గింజల నాణ్యత ఆధారంగా బోనస్ అర్హతను ఖరారు చేస్తారు. రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత వారి వివరాలను పరిశీలించి, నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేస్తారు. కొంతకాలంగా బోనస్ చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వేగంగా స్పందించి నిధులు విడుదల చేయడంతో రైతుల్లో ఊరట కనిపిస్తోంది.

పంట పెట్టుబడి భారీగా పెరిగిన పరిస్థితుల్లో క్వింటాకు అదనంగా రూ.500 రైతులకు పెద్ద ఊతంగా మారనుంది. సన్న వడ్లకు బోనస్ ప్రకటించడంతో భవిష్యత్తులో దొడ్డు రకాల కంటే సన్న రకాల సాగు వైపు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సోమవారం నుంచి కూడా మీ ఖాతాలో నగదు జమ కాకపోతే రైతులు .. మీ బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. పౌర సరఫరాల శాఖ వెబ్‌సైట్‌లోని ‘ఫార్మర్ కార్నర్’ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. లేదా మండల వ్యవసాయ అధికారి, కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జ్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి