ఆ నియోజకవర్గంలో లోకల్ – నాన్ లోకల్ వార్ నడుస్తోందా? యువ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయా? పట్టు కోసం కాంగ్రెస్ లోకల్ జపం చేస్తోందా? అభివృద్ధికి పట్టం కట్టాలంటూ బీఆర్ఎస్ తిప్పికొడ్తోందా? సీనియర్ నేతల వారసులు తలపడుతున్న సాగర్‌లో ఎలా ఉంది పొలిటికల్ సీన్? లోకలా? నాన్‌లోకలా? నాగార్జునసాగర్ పేరు చెప్పగానే ప్రపంచ పర్యాటక కేంద్రం, తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయని నాగార్జునసాగర్ ప్రాజెక్టు గుర్తుకొస్తుంది. రాజకీయాల ప్రస్తావన రాగానే రాజకీయ దిగ్గజం కుందూరు జానారెడ్డి గుర్తుకొస్తారు. ఈ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన ఘనత సాధించారు. గతంలో చలకుర్తి, ఇప్పుడు నాగార్జునసాగర్. 12 సార్లు ఎన్నికలు జరిగితే ఏడుసార్లు జానారెడ్డే గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఎన్నికల్లో సాగర్ ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో ప్రతిపక్షనేతగా వ్యవహరించారు జానారెడ్డి. ఇప్పుడాయన కుమారుడు జైవీర్ రెడ్డి కాంగ్రెస్‌నుంచి బరిలోకి దిగారు.
2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన సీనియర్ నేత నోముల నరసింహయ్య సాగర్‌లో జానారెడ్డిని ఓడించారు. నోముల నర్సింహయ్య మృతితో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు భగత్ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి జానారెడ్డిని ఓడించారు. అప్పట్నించీ జానారెడ్డి క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మళ్లీ నోముల భగత్‌ని పోటీకి దించితే.. జానారెడ్డి తనయుడు జైవీర్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. ఇద్దరూ సీనియర్ల వారసులు కావడం, యువకులే కావడంతో రసవత్తరంగా మారింది సాగర్ రాజకీయం.
మాటల తూటాలతో సాగర్ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు ప్రధానపార్టీల అభ్యర్థులు. ఇప్పటికే గిరిజన చైతన్య యాత్ర పేరుతో జైవీర్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వలసలతో కాంగ్రెస్‌లో జోష్ పెరిగింది. సాగర్‌లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. హాలియా మండలం అనుముల జైవీర్ రెడ్డి స్వగ్రామం కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగత్‌ది నకిరేకల్ మండలం పాలెం గ్రామం. దీంతో భగత్ స్థానికేతరుడన్న విషయాన్ని ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేస్తోంది హస్తం పార్టీ. ఈ ఎన్నికలు స్థానికులు, స్థానికేతరులకు మధ్య జరుగుతున్న పోరాటమని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.
రాజకీయంగా ఎదుర్కోలేకే కాంగ్రెస్ స్థానికత అంశాన్ని ఎత్తుకుందని తిప్పికొడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల భగత్. 36 ఏళ్లుగా స్థానికుడిగా ఉన్న జానారెడ్డి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్నది నోముల ఆరోపణ. లోకల్, నాన్ లోకల్ అంశాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదంటున్నారు బీఆర్‌ఎస్ అభ్యర్థి. బీఆర్ఎస్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ప్రచారంలో బలంగా చెబుతున్నారు. ఇక్కడ పుడితేనే స్థానికుడు కాదని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినవారే స్థానికుడవుతారన్న వాదనతో ప్రజల్లోకి వెళ్తున్నారు నోముల భగత్.
మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లాలో వారసుల ఫైట్ అందరినీ ఆకర్షిస్తోంది. మాటల తూటాలతో హీటెక్కుతున్న నాగార్జునసాగర్‌లో ప్రజలు స్థానికత అంశాన్ని పట్టించుకుంటారో లేదోగానీ.. ప్రచారాస్త్రాల్లో అదికూడా కీలకంగా మారిపోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి