
ఉమ్మడి మెదక్ జిల్లాలోని మూడు నియోజకవర్గలపై సీరియస్‌గా దృష్టి సారించారు మంత్రి హరీష్ రావు. అక్కడ ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది అని ఆరా తీస్తున్నారు మంత్రి హరీష్ రావు. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. జిల్లాలో మొత్తం 10 నియోజకవర్గాలు ఉంటే 2018లో జరిగిన ఎన్నికల్లో 9 స్థానాలను గెలుచుకుంది బీఆర్ఎస్. మళ్ళీ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలవాలని, అందుకు తగ్గట్టుగా ప్రతి ఒక్క నాయకుడు పనిచేయాలని జిల్లా మంత్రి హరీష్ రావు సూచనలు చేస్తున్నారు..
ఇందులో భాగంగా ఏ నియోజకవర్గంలో అయితే కొంత బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా ఉందో ఆ నియోజకవర్గాలపై సీరియస్‌గా దృష్టి సారించారట మంత్రి హరీష్ రావు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్ నియోజకవర్గాలపై ప్రత్యేక నజర్ వేశారట మంత్రి హరీష్ రావు. జహీరాబాద్ ఎమ్మెల్యే మానిక్ రావు పని తీరుపై నియోజకవర్గ వ్యాప్తంగా చాలా వ్యతిరేకత ఉన్నట్లు సర్వేలు సూచించాయట. దీంతో ఈసారి జరిగే ఎన్నికల్లో ఇతన్ని మారుస్తారన్న ప్రచారం జోరుగా సాగింది. దీనితో చాలా మంది ఇతర పార్టీల నేతలు.. ఎమ్మెల్యే టికెట్ ఆశించి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కానీ ఎలాంటి మార్పు లేకుండా ఈ ఎన్నికల్లో కూడా టికెట్ మళ్ళీ మానిక్ రావుకే ప్రకటించింది బీఆర్ఎస్ అధిష్టానం. ఇలా టికెట్ అనౌన్స్ అయ్యిందో లేదో కొంతమంది నేతలు పార్టీని వీడారు. మరి కొంతమంది పార్టీలోనే ఉంటూ మానిక్ రావుకి మద్దతు ఇవ్వడం లేదు. ఇక్కడ మానిక్ రావు ఓటమి పక్కా అని బాగా ప్రచారం జరిగింది. ఏకంగా హరీష్ రావు రంగంలోకి ఇంటిని చక్కదిద్దే పనిలో పడ్డట్టు సమాచారం.
ఇక మెదక్ నియోజకవర్గం విషయానికి వస్తే.. ఇక్కడ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికే మళ్ళీ టికెట్ కన్ఫర్మ్ చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి మైనంపల్లి హన్మంత్ రావు కొడుకు రోహిత్ పోటీలో ఉన్నారు. మొన్నటి వరకు మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి, మెదక్ బీఅర్ఎస్ టికెట్ తన కొడుకు రోహిత్‌కు ఇవ్వాలని డింమాండ్ చేశారు. అది రాకపోవడంతో కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ఎలాగైనా మెదక్ లో గెలిచి తీరుతామని ఛాలెంజ్ చేశారు మైనంపల్లి. ఇదే విషయాన్ని మంత్రి హరీష్ రావు కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా సరే ఇక్కడ మైనంపల్లిని ఓడించాలని కంకణం కట్టుకుని నియోజకవర్గం మొత్తం కలయ తిరుగుతున్నారట.
ఇక సంగారెడ్డి నియోజకవర్గానికి వస్తే.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా జగ్గారెడ్డి కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 స్థానాలో 9 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటే.. ఒక్క సంగారెడ్డిలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి చింత ప్రభాకర్ ఓడిపోవడంతో.. కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి గెలుపొందారు. అప్పటి నుండే ఈ నియోజకవర్గంపై ఫోకస్ చేశారు మంత్రి హరీష్..ఈసారి కూడా మళ్లీ బీఆర్ఎస్ టికెట్ చింత ప్రభాకర్‌కే ఇచ్చారు అధినేత కేసీఆర్. చింత ప్రభాకర్ గెలుపు కోసం ఇక్కడ కాంగ్రెస్ ఓటమి కోసం ప్రణాళికలు రచిస్తుంది బీఆర్ఎస్. జగ్గారెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడని, కనీసం ఫోన్‌లో కూడా దొరకడు అనే విషయాలను జనాల్లో చెబుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింత ప్రభాకర్ ప్రచారం చేస్తున్నారట. దీనికి తోడు మంత్రి హరీష్ నియోజకవర్గ నేతలను సమన్వయ పరుస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
ఇలా ఈ మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారట మంత్రి హరీష్ రావు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లోని ప్రతిపక్ష పార్టీల నాయకులను బీఆర్ఎస్‌లోకి వచ్చేలా చర్యలు చేపట్టారు మంత్రి హరీష్ రావు. మెదక్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో ఉన్న కాంగ్రెస్ అగ్ర లీడర్లను ఇప్పటికే బీఆర్ఎస్‌లోకి తెచ్చారట మంత్రి హరీష్ రావు. ఏది ఏమైనా ఉమ్మడి జిల్లాలోని పది పదికి స్థానాలు బీఆర్ఎస్ గెలవాలని పార్టీ నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారట మంత్రి హరీష్ రావు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..