
రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన ఫిర్యాదులను ఇకపై ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కొత్త ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్‌ను ప్రారంభించింది. గతంలో ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదు చేయాలంటే సంబంధిత కార్యాలయాలను ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త ఆన్‌లైన్ విధానంతో ఇంటి నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేక సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆన్‌లైన్ ఫిర్యాదు వ్యవస్థను వినియోగించేందుకు వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా సిస్టమ్‌లోకి ప్రవేశించవచ్చు. అనంతరం ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన ఫిర్యాదు లేదా సమస్య వివరాలను నమోదు చేయవచ్చు. పాఠశాలల్లో ఎదురయ్యే వివిధ సమస్యలు, నిబంధనల ఉల్లంఘనలు, ఇతర ఫిర్యాదులను ఈ వేదిక ద్వారా విద్యాశాఖకు తెలియజేయవచ్చు.
కొత్త వ్యవస్థలో కేవలం ఫిర్యాదు నమోదు చేయడమే కాకుండా.. దాని పురోగతిని తెలుసుకునే అవకాశం కూడా కల్పించారు. ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చే గ్రీవెన్స్ ఐడీ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ఫిర్యాదు ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చు. దీంతో ఫిర్యాదు ఏ దశలో ఉంది? దానిపై అధికారులు ఏ మేరకు చర్యలు తీసుకున్నారు? అనే వివరాలను ఆన్‌లైన్‌లోనే పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది.
ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన సమస్యలను కొత్త ఆన్‌లైన్ సదుపాయం ద్వారా విద్యాశాఖ దృష్టికి తీసుకురావచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్ తెలిపారు. ఫిర్యాదులు చేసేటప్పుడు సరైన, వాస్తవ సమాచారాన్ని అందించాలని ఆయన సూచించారు. ప్రజలు ఆధారరహిత లేదా తప్పుడు ఫిర్యాదులకు బదులుగా నిజమైన సమస్యలను స్పష్టమైన వివరాలతో నమోదు చేయాలని కోరారు.ఫిర్యాదుల కోసం తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లోని ప్రైవేట్ స్కూల్ కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్‌ను వినియోగించుకోవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.