Charminar: చార్మినార్‌లో చారిత్రక గడియారం మూగబోయింది.. 12:30 గంటల వద్దే స్టాప్!
Charminar Clock: మొజంజాహి మార్కెట్ చారిత్రక గడియారం కూడా ఆగిపోవడం, తాజాగా చార్మినార్‌లోని గడియారం పనిచేయకపోవడం నేపథ్యంలో.. హైదరాబాద్‌లోని చారిత్రక గడియారాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. చార్మినార్ పరిసరాల్లోని లాడ్‌బజార్‌లో పనిచేసే కార్మికులు, వ్యాపారులు..

Charminar Clock: హైదరాబాద్ నగరానికి చారిత్రక గుర్తింపుగా నిలిచిన మొజంజాహి మార్కెట్ గడియారం ఇప్పటికే మూగబోయింది. తాజాగా చార్మినార్‌లోని ఓ గడియారం కూడా పనిచేయకుండా ఆగిపోవడంతో పర్యాటకుల్లో ఆసక్తితో పాటు ఆందోళన వ్యక్తమవుతోంది. చార్మినార్‌కు వచ్చే కొందరు పర్యాటకులు గడియారాలను ఫొటోలు తీసి.. తప్పు సమయం చూపిస్తున్న చారిత్రక గడియారాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మూడు రోజులుగా 12:30 గంటల వద్దే ఆగిపోయిన గడియారం
నాలుగు వందల ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన చార్మినార్‌ను నిర్వహణ లోపాలు వెంటాడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. చార్మినార్‌లోని లాడ్‌బజార్ వైపు ఉన్న గడియారాల్లో ఒకటి పనిచేయడం లేదు. గడియారం 12:30 గంటల వద్దే ఆగిపోయింది. మరోవైపు ఉన్న గడియారం మాత్రం సరైన సమయాన్ని చూపిస్తోంది. ఈ విషయాన్ని స్థానికులు, పర్యాటకులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే గడియారం పనిచేయకపోవడంపై వెంటనే చర్యలు తీసుకోకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు సందర్శించే చార్మినార్‌లో ఇలాంటి పరిస్థితులు ఉండటంపై పర్యాటక ప్రేమికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే చార్మినార్‌పై నుంచి పెచ్చులు ఊడిపడిన ఘటన
చార్మినార్ నిర్వహణపై గతంలోనూ ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇటీవల చార్మినార్ పైభాగం నుంచి పెచ్చులు ఊడిపడిన ఘటన కలకలం రేపింది. ఆ ఘటన మరువకముందే ఇప్పుడు చార్మినార్‌లోని చారిత్రక గడియారం పనిచేయకుండా నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌కు వచ్చే విదేశీ పర్యాటకులు సైతం చార్మినార్‌ను తప్పక సందర్శిస్తుంటారు. హైదరాబాద్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చే చారిత్రక కట్టడాల్లో చార్మినార్‌ది ప్రత్యేక స్థానం ఉందనడంలో సందేహం లేదు. అలాంటి చారిత్రక కట్టడం నిర్వహణ విషయంలో అధికారులు మరింత శ్రద్ధ చూపాలని స్థానికులు, పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు.
లాడ్‌బజార్ వ్యాపారులకూ ఇబ్బందే
చార్మినార్ పరిసరాల్లోని లాడ్‌బజార్‌లో పనిచేసే కార్మికులు, వ్యాపారులు సైతం ఈ గడియారాల సమయాన్ని గమనిస్తుంటారు. గడియారం పనిచేయకపోవడంతో స్థానికంగా కూడా అసౌకర్యం ఏర్పడుతోందని చెబుతున్నారు. పురావస్తు శాఖ అధికారులు వెంటనే నిపుణులతో గడియారాన్ని పూర్తిస్థాయిలో మరమ్మతు చేయించాలని కోరుతున్నారు.
మరమ్మతులు జరుగుతున్నాయి
చార్మినార్ గడియారం పనిచేయకపోవడంపై అధికారులు స్పందించారు. గడియారంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన వెంటనే దాన్ని నిలిపివేసినట్లు చార్మినార్ అధికారి రాజేశ్వరి తెలిపారు. పురాతన గడియారాల మరమ్మతుల్లో నిపుణులైన వహబ్ వాచ్ కంపెనీ నిపుణులతో మరమ్మతులు చేయిస్తున్నామని చెప్పారు. శనివారం సాయంత్రానికి మరమ్మతులు పూర్తయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇక మొజంజాహి మార్కెట్ చారిత్రక గడియారం కూడా ఆగిపోవడం, తాజాగా చార్మినార్‌లోని గడియారం పనిచేయకపోవడం నేపథ్యంలో.. హైదరాబాద్‌లోని చారిత్రక గడియారాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




