Telangana: భక్తులకు బిగ్‌ అలర్ట్.. తెలంగాణ ఆలయాల్లో కొత్త రూల్స్.. సీఎం కీలక ఆదేశాలు

తెలంగాణలోని ఆలయాల్లో ఇక కొత్త నిబంధనలు రానున్నాయి. తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో తిరుమల తరహా నిబంధనలు అమలు చేయాలని అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలయాల పరిసరాల్లో రాజకీయ జెండాలు, సభలు ఏర్పాటు నిషేధం విధించాలన్నారు. ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచించారు.

Telangana: భక్తులకు బిగ్‌ అలర్ట్.. తెలంగాణ ఆలయాల్లో కొత్త రూల్స్.. సీఎం కీలక ఆదేశాలు
Telangana Temples New Rules

Edited By:

Updated on: Apr 04, 2026 | 6:18 PM

రాష్ట్రంలోని ప్రముఖ ఆల‌యాల‌ ప‌రిస‌రాల్లో తిరుమ‌ల త‌ర‌హాలో నిబంధ‌న‌లు అమ‌లు చేయాల‌ని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేవాలు జారీ చేశారు. రాజ‌కీయ పార్టీల స‌భ‌లు, జెండాలు, ప్రద‌ర్శనలు లేకుండా ఆధ్యాత్మికత‌కు పెద్దపీట వేయాల‌ని సీఎం సూచించారు. బాస‌ర జ్ఞాన స‌ర‌స్వతి దేవాల‌య అభివృద్ధి ప‌నుల‌పై అధికారులతో శ‌నివారం స‌మీక్ష నిర్వహించారు సీఎం రేవంత్. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు ప‌వ‌ర్‌పాయింట్ ప్రజంటేష‌న్ ద్వారా సీఎంకు వివ‌రించారు. ఆల‌య అభివృద్ధి ప‌నుల‌కు రూ.225 కోట్ల వ్యయ‌మ‌వుతుంద‌ని అధికారులు తెలియ‌జేశారు.

తర్వాత మాస్టర్‌ప్లాన్‌ను ప‌రిశీలించిన సీఎం అందులో ప‌లు మార్పులు సూచించారు. సంప్రదాయాలు, శాస్త్రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని భ‌క్తుల విశ్వాసాల‌కు పెద్దపీట వేస్తూ బాస‌ర ఆల‌య అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. భ‌విష్యత్ అవ‌స‌రాలు, భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకొని విశాల‌మైన రోడ్లు నిర్మించాల‌ని ఆదేశించారు. ఆల‌య ప్రాంగణం భ‌విష్యత్‌లో భారీ వృక్షాల‌తో అల‌రారేలా అవ‌స‌ర‌మైన మొక్కలు నాటాల‌న్నారు. ఆల‌యం స‌మీపంలో హెల్త్ సెంట‌ర్ నిర్మించాల‌ని.. పుష్కరాలు, ఇత‌ర ఉత్సవాల రోజుల్లో అక్కడ త‌గిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భ‌క్తుల‌కు సేవ‌లు అందించేందుకు అనువుగా నిర్మాణం ఉండాలన్నారు.

ఎంత‌టి ప్రముఖుల వాహ‌నాలైనా ఆల‌య ప్రాంగ‌ణానికి బ‌య‌టే నిలిచిపోవాల‌ని.. ఆల‌య ప్రాంగ‌ణంలోకి కేవ‌లం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాల‌ని సీఎం ఆదేశించారు. ఇందుకు అవ‌స‌ర‌మైన ప్రణాళిక‌లు రూపొందించాల‌ని, వాహ‌నాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూప్‌టాప్ ఏర్పాటు చేయాల‌న్నారు. అభివృద్ధి ప‌నుల స‌మ‌యంలో ఆల‌య ప‌విత్రత‌కు ఎటువంటి భంగం కల‌గ‌కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అభివృద్ది ప‌నుల నాణ్యత‌లో రాజీప‌డితే ఏమాత్రం స‌హించేది లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us