సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్వీ రమణకు తెలుగు రాష్ట్రాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జస్టిస్ రమణకు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలుపారు. ఈ మేరకు ఆయనకు ఓ సందేశాన్ని పంపారు. ‘మన తెలుగు తేజం ఎన్‌వీ రమణగారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి శుభాభినందనలు’ అంటూ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మీ విశేష అనుభవం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా.. దేశానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. మీ పదవీకాలం గొప్పగా సాగాలని ఆకాంక్షిస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
జస్టిస్ ఎన్వీ రమణ చేత రాష్ర్టపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ 2022, ఆగస్టు 26వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. కొవిడ్ దృష్ట్యా రాష్ట్రపతి భవన్‌లో నిరాడంబరంగా సాగిన కార్యక్రమంలో కొద్దిమంది అతిథుల సమక్షంలోనే జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్ర మంత్రులు, కేబినెట్ సెక్రటేరియట్ అధికారులు, న్యాయ మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో పాటు జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.