నేడు కేబినెట్ సమావేశం..! చర్చకు రానున్న కీలక అంశాలు ఇవే..

తెలంగాణ కేబినెట్ సమావేశం సోమవారం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్ట్, స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతు భరోసా పథకం, కొత్త క్రీడా విధానం వంటి అంశాలపై చర్చ జరుగుతుంది. కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ సమావేశం తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం జరిగే అవకాశం ఉంది.

నేడు కేబినెట్ సమావేశం..! చర్చకు రానున్న కీలక అంశాలు ఇవే..
Telangana Cabinet

Updated on: Jun 23, 2025 | 6:59 AM

సోమవారం మధ్యహ్నం 3 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన బనకచర్ల పై ఏం చేద్దాం అనే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ పెద్దలు కేంద్రానికి అభ్యంతరాలు తెలిపారు. ఈ అంశంపై అధికారులు, మంత్రులతో కూడిన కమిటీ నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశానికి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసే ఛాన్స్‌ ఉంది.

స్థానిక సంస్థ ఎన్నికలపై క్లారిటీ

ఈ కేబినెట్‌ సమావేశంలో మరో ముఖ్యమైన అంశం ఏంటంటే.. స్థానిక సంస్థ ఎన్నికల నిర్వహణ. జూలైలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. దీంతో ఎన్నికల నిర్వహరణపై ఒక స్పష్టత కూడా ఈ భేటీ తర్వాత వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు ఆర్ఆర్ఆర్(రిజినల్‌ రింగ్‌ రోడ్డు) దక్షిణభాగం అలైన్మెంట్కుకు ఆమోదం తెలపనున్నారు. బాగ్ లింగంపల్లి హౌసింగ్ బోర్డు భూములపై నిర్ణయం తీసుకుంటారని సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. పథకాలపై చర్చించే అవకాశం ఉంది. రైతు భరోసా విజయోత్సవాల నిర్వహించాలని కూడా ఈ కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించనున్నారు.

వాన కాలం పంటలకు రైతు భరోసా నిధుల పంపిణి చేయనున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మంత్రి వర్గ ఆమోదం ఉందా లేదా.. ఈ నెల 30 లోగా వివరాలు అందించాలని ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్ లేఖ రాసింది. దీనిపై కూడా నేటి కేబినెట్‌ భేటీలో చర్చించే అవకాశం. కాగా నేటి క్యాబినెట్ భేటీకి ముగ్గురు కొత్త మంత్రులు హాజరుకానున్నారు. కొత్త మంత్రులు వివేక్, వాకిటి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిచయ కార్యక్రమం కూడా ఉండబోతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి