
శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,24,234 లక్షల కోట్ల వ్యయంతో బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, గిరిజన రైతుల అభివృద్ధికి ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. ఇందిర సౌర గిరి జల వికాసం’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. దూర ప్రాంతాల్లోని గిరిజన రైతులకు సాగునీటి సౌకర్యం అందించడమే లక్ష్యంగా పథకం ముఖ్య ఉద్దేశమన ఆయన పేర్కొన్నారు.
ఈ పథకం ద్వారా సుమారు 2.10 లక్షల మంది గిరిజన రైతులు లబ్ధి పొందనున్నారు. ముఖ్యంగా 6 లక్షల ఎకరాల పోడు భూముల్లో అటవీ ఉత్పత్తులకు సంబంధించిన తోటల అభివృద్ధిని ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ఈ క్రమంలో 100 శాతం సబ్సిడీతో సౌర పంపు సెట్లను రైతులకు అందజేయనుంది. విద్యుత్ సౌకర్యం లేని అటవీ ప్రాంతాల్లో సౌరశక్తి ద్వారా సాగునీటిని అందించి రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఇప్పటికే అచ్చంపేట నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని ప్రారంభించి మంచి ఫలితాలు సాధించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ అనుభవాన్ని ఆధారంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం వ్యవసాయం, సాగునీటి రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. సాగునీటి ప్రాజెక్టుల వేగవంతమైన పూర్తికి రూ.22,600 కోట్లు, వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించింది. రైతు భరోసా పథకానికి రూ.18,000 కోట్లు, వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ కోసం రూ.3,500 కోట్లు కేటాయించడం జరిగింది.
ఈ చర్యల ద్వారా గిరిజన ప్రాంతాల్లోని పోడు రైతులతో పాటు అన్ని వర్గాల రైతులకు మేలు చేకూరనుంది. గిరిజన ఆవాసాల్లో మౌలిక సదుపాయాలు, సాగునీరు, ఆర్థిక భద్రత కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. పర్యావరణానికి అనుకూలమైన సౌరశక్తిని వ్యవసాయానికి అనుసంధానం చేయడం ద్వారా తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.