
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల విద్యార్థులకు ప్రతిరోజూ పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. మంచిర్యాల జిల్లా పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూఫ్ టాప్ ఆటోమేటెడ్ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులు, హరేకృష్ణ ఫౌండేషన్ సహకారంతో 42 వేల మంది విద్యార్థులకు ఒకే సమయంలో అల్పాహారం, 5 వేల మంది కళాశాల విద్యార్థులకు మద్యాహ్న భోజనాన్ని అందించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు అర్థాకలితో ఉండకూడదన్న నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అల్పాహార పథకం మంచిర్యాల జిల్లా లో ఆగస్టు 31వ తేదీన ప్రారంభం కానుంది.
ఈ కిచెన్‌కు హరేకృష్ణ మూవ్‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ అమలు భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించనున్నారు. ఈ కిచెన్ ద్వారా 18 మండలాల్లోని 691 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42,450 మంది విద్యార్థులకు, అలాగే 13 జూనియర్ కాలేజీల్లో చదువుతున్న 6,654 మంది విద్యార్థులకు ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు.
విద్యార్థులు ఉదయం పూట అర్థాకలితో పాఠశాలకు వెళ్లకుండా, ఆరోగ్యకరమైన అల్పాహారంతో ఉత్సాహంగా విద్యను అభ్యసించేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుందని చెపుతున్నారు నిర్వహకులు. ఈ సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా గంటకు 8 వేల ఇడ్లీలు, 3 వేల దోశలు, 5 వేలకు పైగా పూరీలు తయారు చేసే సామర్థ్యంతో ఈ కిచెన్ ఏర్పాటు చేశామని హరేకృష్ణ మూమెంట్ నిర్వహకులు చెపుతున్నారు. రెండు గంటల్లో 5 వేల మంది విద్యార్థులకు సరిపడా సాంబారు, కూరలను తయారు చేస్తామని తెలిపారు.
పక్కా శాఖాహారంతో భోజనాన్ని అందిస్తామని.. 15 నిమిషాల్లోనే వెయ్యి మందికి సరిపడా అన్నం సిద్ధం చేసే పరికరాల అందుబాటులో ఉన్నాయని కిచెన్ ఏజీవిం సందీప్ సింగ్ తెలిపారు. వెజిటబుల్ వాషింగ్, కటింగ్ యూనిట్లతో పాటు మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, ఆర్వో వాటర్ ప్లాంట్, బాయిలర్ ప్లాంట్, సెంట్రల్ గ్యాస్ బ్యాంక్, వ్యర్థ నీటి శుద్ధి ప్లాంట్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు సెంట్రలైడ్జ్ కిచెన్ పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదుతున్న విద్యార్థులు ఎవరు అర్థాకలితో ఉండకూడదనే నిర్ణయంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారని.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా ముందుకు వెళుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకునాణ్యమైన విద్యతో పాటు పోషక ఆహారాలతో కూడిన అల్పాహారం, భోజనం అందించడం మా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆగష్టు 31 నుండి మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ఈ అల్పాహర పథకాన్ని అమలు చేయబోతున్నట్టు ఎమ్మెల్యే ప్రేంసాగర్ రావు తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..