తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కమిటీలతో రాజుకున్న అగ్గిని.. తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో బిజీగా ఉంది కాషాయ టీమ్. ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. ఇప్పుడు కాంగ్రెస్ కల్లోలాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలన్న ఆలోచనను అమల్లో పెట్టే ప్రయత్నంలో ఉన్నారు బీజేపీ నేతలు. మనకున్న బలంతో దూసుకెళ్తూనే.. ఎదుటోడి బలహీనతను తమకు ఫేవర్‌గా చేసుకోవాలనే స్కీమ్‌కు ఇలా తెరలేపింది బీజేపీ. అందుకే, అప్పుడే పొలిటికల్ మైండ్ గేమ్ మొదలెట్టినట్టు సమాచారం. పదవులు దక్కని సీనియర్లంతా.. తిరుగుబాటు జెండా ఎగరేయడంతో తెలంగాణ కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.
ఇదే అదనుగా అసంతృప్త నేతలకు గాలం వేసే పనిలో ఉందట బీజేపీ. అందుకోసం ఇప్పటికే.. రాష్ట్ర పార్టీ కీలక నేతలకు.. బీజేపీ పెద్దలు సూచనలు చేసినట్టు సమాచారం. ఈటల రాజేందర్, డీకే అరుణ వంటి నేతలు… కాంగ్రెస్‌లోని అసంతృప్తి నాయకులతో సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతవరకు నిజమో తెలియదు గానీ.. పలువురు కాంగ్రెస్ నాయకులు సైతం… కాషాయ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది.
తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్‌లో కలకలం చాలాసార్లే కనిపించినా.. ఈస్థాయి సంక్షోభం ఎప్పుడూ చూడలేదు. ఇదే అదనుగా ప్రత్యర్థిని దెబ్బకొట్టేందుకు కాషాయసేన సిద్ధమైనట్టు తెలుస్తోంది. పీసీసీ కమిటీల ప్రకటనతో.. తీవ్ర నిరసన వ్యక్తంచేస్తూ సీనియర్లందరూ.. భట్టి ఇంట్లో సమావేశం కావడంతో… ఇటు వైపు నుంచి బీజేపీ నేతలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఓ లిస్టు రెడీ చేసి.. దొరికినోళ్లను దొరికినట్టు.. పార్టీలోకి లాగెయ్యాలనే స్కెచ్ వేసేసినట్టు సమాచారం. అందుకు తగ్గట్టే.. కాంగ్రెస్ అసంతృప్తుల్లో చాలామంది… పార్టీ మారబోతున్నారనే ప్రచారం కూడా జోరందుకుంది.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి దూకిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి… తన పాతమిత్రులకు ఓపెన్ ఆఫర్ ఇవ్వడం చూస్తుంటే.. కమలదళం వేసిన స్కెచ్ ఈజీగా అర్థమైపోయింది. రేవంత్‌తో విభేదిస్తున్న నేతలంతా.. బీజేపీలోకి రావాలంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. రేవంత్‌తో ఒరిగేదేమీ లేదనీ.. అంతా కలిసి వస్తే బీజేపీలోనే మంచి భవిష్యత్తు ఉంటుందంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేశారు. కేసీఆర్‌ను ఓడించాలనుకునే కాంగ్రెస్ నేతలకు… బీజేపీ సాదర స్వాగతం పలుకుతోందంటూ మరో సీనియర్ నేత కూడా వెల్‌కమ్ చెప్పారని తెలుస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో… కాంగ్రెస్ అసంతృప్తనేతలు సైతం డెసిషన్ తీసుకునేందుకు తొందరపడుతున్నట్టు సమాచారం.
తెలంగాణలో ముదిరిన సంక్షోభాన్ని చల్లార్చే బాధ్యతను సీనియర్ నేత దిగ్విజయ్ మీద పెట్టింది కాంగ్రెస్ అధిష్టానం. త్వరలోనే ఆయన హైదరాబాద్ వచ్చి.. సీనియర్లతో సమావేశం కానున్నారు. అయితే, ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్‌లో స్పీడు పెంచిన బీజేపీ.. ఆలోపు ఎంతమంది కాంగ్రెస్‌నేతలను తమవైపు లాగేస్తుందోనన్న చర్చ తెలంగాణ పొలిటికల్ కారిడార్‌లో జోరుగా జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం