Bandi Sanjay: సాయి గణేష్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలి.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్

|

Apr 20, 2022 | 11:36 AM

తెలంగాణలో ఎక్కడ చూసినా హత్యలు, కబ్జాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎక్కడ నేరం జరిగినా కారకులు టీఆర్ఎస్ నేతల పేర్లే వినిపిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు.

Bandi Sanjay:  సాయి గణేష్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలి.. బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్
Bandi Sanjay
Follow us on

Telangana BJP Chief Bandi Sanjay Kumar: కేసీఆర్‌ పరిపాలన…నిజాం పాలనను తలపిస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. ఒకప్పుడు సినిమాలో విలన్ వస్తే ఇంట్లకు పోయి బిక్కుబిక్కుమని బతికేటోళ్లు… నిజాం పాలనలో రజాకార్లు వస్తే మాన ప్రాణాలు పోతాయని బిక్కుబిక్కుమని బతికేటోళ్లు. మనం నిజాం పాలనను చూడలేదు…. కేసీఆర్ పాలనలో నిజాం కాలం నాటి పరిస్థితులెట్లున్నయో కళ్లారా చూపిస్తున్నాం. నిజాంను మించిన అరాచక పాలనను కొనసాగిస్తున్నారని బండి సంజయ్ అన్నారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేశ్‌ పోలీసుల వేధింపులు తాళలేకే ఆత్మహత్య చేసుకున్నారని సంజయ్‌ ఆరోపించారు. ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’లో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ వద్ద శిబిరంలో నిరసన దీక్ష చేపట్టారు.

తెలంగాణలో ఎక్కడ చూసినా హత్యలు, కబ్జాలు, అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. ఎక్కడ నేరం జరిగినా కారకులు టీఆర్ఎస్ నేతల పేర్లే వినిపిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని ఇప్పటికైనా బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో జరగుతున్న దారుణాలపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తప్పు చేసిన టీఆర్ఎస్ నాయకులను శిక్షించాలన్నారు. ప్రజలను అరిగోస పెడుతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఖమ్మంలో చనిపోయిన సాయి గణేష్ మరణానికి కారకులైన నాయకులు, పోలీసులకు కఠిన శిక్ష పడేదాకా ఇటు ప్రజా క్షేత్రంలో, అటు న్యాయ పరంగా పోరాతామని స్పష్టం చేశారు.