
తెలంగాణలో మీకు రేషన్ కార్డు ఉందా..? అయితే ఎగిరి గంతేసే వార్త. ప్రభుత్వం రేషన్ కార్డులు కలిగి ఉన్నవారందరికీ తాజా బడ్జెట్‌లో శుభవార్త అందించింది. తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో 2026-27 ఆర్దిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో తెలంగాణ ప్రజలకు తీపికబురు అందించింది. బడ్జెట్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అనే కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకానికి నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీ నుంచి ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. అసలు ఈ పథకం ఏంటి..? ఎవరెవరికి లబ్ది చేకూరుతుంది..? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రాష్ట్రంలోని ప్రజలకు ఇన్యూరెన్స్ సౌకర్యం కల్పించడమే ఈ పథకం లక్ష్యం. ప్రతీ కుటుంబానికి రూ.5 లక్షల ఇన్యూరెన్స్ సదుపాయం కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల కుటుంబాలకు ఇన్యూరెన్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. సామాజిక అంతరాలతో సంబంధం లేకుండా కుటుంబ జీవిత బీమా కల్పించనుంది.
తెలంగాణ వ్యక్తి అయి ఉండాలి. తెలంగాణలో రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతీఒక్కరికీ ఈ పథకం వర్తిస్తుంది. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో ఈ ప్రకటన చేశారు. తెలంగాణలో పుట్టడం, జీవించడం ఒక వరంగా భావించేలా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. సామాన్యుల జీవితానికి భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకం తెచ్చినట్లు స్పష్టం చేశారు.
కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే.. కుటుంబానికి రూ.5 లక్షల సాయం అందుతుంది. నేరుగా నామినీ బ్యాంక్ అకౌంట్లో ఇవి జమ అవుతాయి. కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబం మొత్తం ఆర్ధిక కష్టాలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. కుటుంబం మొత్తం రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. దీంతో కుటుంబాలకు ఆర్ధిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఈ పథకం తెచ్చింది. ప్రజలు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వమే మొత్తం ప్రీమియాన్ని చెల్లిస్తుంది. దీని వల్ల ప్రజలపై ఎలాంటి భారం పడదు. బడ్జెట్‌లో ఈ పథకానికి నిధులు కేటాయించడంతో.. అమలు చేసేందుకు రంగం సిద్దమైంది. ప్రైవేట్ ఇన్యూరెన్స్ కంపెనీల్లో జీవిత బీమా పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం చెల్లించాలి. కానీ ప్రభుత్వమే ఉచితంగా ఈ సౌకర్యం కల్పించడం మంచి విషయంగా చెప్పవచ్చు.