
తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి మద్దతుగా ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ సుమధుర గ్రూప్ భారీ పెట్టుబడికి శ్రీకారం చుట్టింది. రూ.600 కోట్ల పెట్టుబడికి సంబంధించి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదర్చుకుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో ఈ ఒప్పందం జరిగింది. సుమధుర గ్రూప్ రాబోయే రెండు సంవత్సరాల కాలంలో రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 100 ఎకరాల విస్తీర్ణంలో గ్రేడ్ A+ ఇండస్ట్రియల్ పార్క్‌ను అభివృద్ధి చేస్తుంది. ఈ భారీ ప్రాజెక్ట్ కార్యకలాపాలు పెరిగేకొద్దీ రాబోయే రెండేళ్లలో సుమారు 8 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా.
ఈ కొత్త పారిశ్రామిక పార్క్.. ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఫార్మాస్యూటికల్, ఇ-కామర్స్ రంగాలకు అవసరమైన అత్యాధునిక ప్లగ్-అండ్-ప్లే సౌకర్యాలను అందించనుంది. పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ఈ పార్క్ ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇందులో మాడ్యులర్ తయారీ బ్లాక్‌లు, అంకితమైన లాజిస్టిక్స్ జోన్‌లు, గ్రీన్ డెవలప్‌మెంట్ ప్రమాణాలు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు ఉంటాయి.
ఈ మైలురాయి గురించి సుమధుర గ్రూప్ వైస్-చైర్మన్ రామారావు కలకుంట్ల మాట్లాడుతూ.. ‘‘ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు పారిశ్రామిక పరివర్తనకు పునాది అని మేము నమ్ముతున్నాము. ఈ పారిశ్రామిక పార్క్ ద్వారా అధిక విలువైన పరిశ్రమలను ఆకర్షించి, వేలాది ఉద్యోగాలను సృష్టిస్తాం. దీన్ని ద్వారా తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడానికి మా వంతు కృషి చేస్తాం’’ అని తెలిపారు. సుమధుర గ్రూప్ ఇండస్ట్రియల్ అండ్ వేర్‌హౌసింగ్ వైస్ ప్రెసిడెంట్ వంశీ కారంగుల మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రపంచ తయారీకి ప్రాధాన్యతనిచ్చే గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతోంది. ఈ ఒప్పందం ఆ ప్రయాణానికి ఎంతో దోహదపడుతుంది. రాష్ట్రంలోని బలమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌తో కలిసి గణనీయమైన ఉపాధిని సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం” అని వివరించారు. దక్షిణ భారతంలో 54 ప్రాజెక్టులతో 13 మిలియన్ చదరపు అడుగులకు పైగా అభివృద్ధి చేసిన సుమధుర గ్రూప్.. తెలంగాణలో పెట్టుబడి, ఆవిష్కరణ, ఉద్యోగ అవకాశాలను సృష్టించనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..