
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సమరశంఖం మోగింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శనివారం(ఆగస్టు 30) MPTC ,ZPTC ల ఎన్నికలు నిర్వహణకు పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ క్రమంలో నోటిఫై చేసిన అన్ని ప్రాదేశిక నియోజకవర్గాల పరిథిలో ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను రూపొందించి ప్రచురించాలని జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ కోసం షెడ్యూల్ సైతం విడుదల చేసింది.
MPTC ,ZPTC ల ఎన్నికలు నిర్వహణకు అయా జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల. సెప్టెంబరు 10వ తేదీ నాటికి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్లు, పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించాలని పేర్కొంది. సెప్టెంబరు 6వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాను సిద్దం చేయాలని ఈసీ కోరింది. అలాగే పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలు ప్రచురించాలని, సెప్టెంబర్ 6 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించాలని సూచించింది. ఇక సెప్టెంబర్ 8వ తేదీన జిల్లా స్థాయిలో కలెక్టర్లు, మండల స్థాయిలో ఎంపీడీవోలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు నిర్వహించాలని, సెప్టెంబర్ 9వ తేదీన అభ్యంతరాలు, వినతులు పరిష్కరించాలని కోరింది. ఇక సెప్టెంబర్ 10వ తేదీన తుది ఓటర్ల జాబితా, తుది పోలింగ్ కేంద్రాల జాబితాలు ముద్రించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలావుంటే ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. గడువు ముగిసినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదంటూ పలువురు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..