Sri Ramanavami: దేశ వ్యాప్తంగా శీరామ నవమి వేడుకలను ఘనముగా నిర్వహించేందుకు భక్తులు భారీగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్(Hyderabad)లో కూడా శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణానికి, శోభా యాత్ర(Shobha Yatra)ను నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఈ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. సీతారాంబాగ్ నుంచి భాగ్యనగర్ శ్రీరామ నవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ధూల్‌పేట్ ఆకాశ్‌పురి హనుమాన్ దేవాలయం నుంచి ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో ఈ శోభాయాత్రను నిర్వహిస్తారు. ఇక్కడ యజ్ఞం అనంతరం శోభాయాత్రను ప్రారంభిస్తారు. టీఆర్‌ఎస్ నేత ఆనంద్‌సింగ్ నేతృత్వంలో స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సీతారాంబాగ్ ద్రౌపది గార్డెన్స్ నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు శోభాయాత్ర ప్రారంభం కానున్నది. రాత్రి 8 గంటలకు సుల్తాన్ బజార్ చేరుకోనున్నది.
శోభాయాత్రను పురస్కరించుకుని నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. యాత్రను చేపట్టే దారి పొడవునా స్వాగత వేదికలతో పాటు యాత్రలో పాల్గొనే వారికి మంచినీటి సౌకర్యం వంటి ఏర్పాట్లు పలువురు స్వచ్చందంగా పూర్తి చేశారు. శోభాయాత్ర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును చేపట్టనున్నారు. సీసీ కెమెరాలు, మొబైల్ కెమెరాల వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
శోభాయాత్ర సందర్భంగా నగరంలో పలు పాత్రల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించింది. శోభాయాత్ర జరిగే మార్గాల్లో భారీ బందోబస్తు చేపట్టారు. సీతారాం బాగ్ టెంపుల్, బోయిగూడ కమాన్, గాంధీ విగ్రహం, బేగంబజార్, సిద్ధంబర్ బజార్, శంకర్‌షేర్ హోటల్, గౌలిగూడ, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, కోఠి ఆంధ్రా బ్యాంక్ మీదుగా సుల్తాన్ బజార్ చేరుకోనుంది. ఈ నేపథ్యంలో ఈ మార్గంలో వెళ్లే.. ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.