
మద్యం మత్తులో కొంతమంది మనుషులు జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు..వావీరసలు లేకుండా మనం మనుషులం అనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఇది తప్పు అని అడ్డుకున్న వాళ్ళపై దాడులు చేస్తూ.. వారిని చంపడానికి సైతం వెనుకాడడం లేదు. ఇలాంటి సంఘటనే సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అమీన్ పూర్ మండలం బీరంగూడ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. మామ చిత్తారి చంద్రయ్యని కత్తితో ఏడు పోట్లు పొడిచి హత్య చేశాడు అల్లుడు కడమంచి రామకృష్ణ.
బీరంగూడ ప్రాంతానికి చెందిన చంద్రయ్య కూతురు లక్ష్మీకి రామకృష్ణకు 20 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. చెత్త బండి నడుపుతూ మంజీరానగర్‌లో జీవిస్తున్న రామకృష్ణ, లక్ష్మీ దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. అయితే మద్యానికి బానిసై తరచూ ఇంట్లో గొడవ పడేవాడు లక్ష్మీ భర్త రామకృష్ణ. కాగా గత కొన్ని రోజులుగా మధ్యం మత్తులో మాటలు రాని మూగ కూతురుపై చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు రామకృష్ణ. ఇది గమనించిన భార్య భర్తతో గొడవ పడి పిల్లలను తీసుకుని మూడు నెలల క్రితం బీరంగూడలోని తల్లి గారింటికి వచ్చింది.
కాగా మద్యం సేవించి తరచూ మామ ఇంటికి వచ్చి గొడవ పడేవాడు లక్ష్మీ భర్త రామకృష్ణ.. అయితే ఈ క్రమంలోనే గురువారం (డిసెంబర్ 11) రాత్రి సైతం మామ ఇంటికి వచ్చి, మామతో గొడవకు దిగాడు రామకృష్ణ. తాగిన మైకంలో
నానా దుర్భాషలాడడంతో వారించిన మామ చంద్రయ్యపై కర్ర, రోకలి బండతో దాడి చేశాడు. ఇంటికి వచ్చే ముందే జేబులో తెచ్చుకున్న కత్తితో మామపై ఏడు సార్లు కత్తి పోట్లు పొడిచాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు రక్తస్రావంలో ఉన్న చంద్రయ్యను బీరంగూడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే చంద్రయ్య మృతి చెందినట్లు నిర్దారించారు వైద్యులు. కూతురు లక్ష్మీ, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..