
సాధారణంగా పాములు ఏ తుప్పల్లోనో.. పొలం గట్టులపైనో కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాలు కురుస్తుండటంతో పాములు పుట్టల్లో నుంచి జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇళ్లలో, బాత్ రూం, షూలలో కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా ఓ బైకులో దూరిన పాము కలకలం రేపింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ పాము అందరినీ ముప్పుతిప్పలు పెట్టింది. ఓ వ్యక్తికి చెందిన బైకులోకి పాము దూరింది. మెకానిక్ షాపు దగ్గరికి తీసుకెళ్లగా దాన్ని బయటకు తీశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఓ రైతుకు చెందిన ద్విచక్ర వాహనం లోకి పాము దూరింది. అందరూ చూస్తుండగానే బైక్ లోపలికి పాము దూరడంతో బైక్ యజమాని షాక్ గురయ్యాడు. ఇంటికి ఎలా పోవుడు రా.. దేవుడా అంటూ ఆందోళన చెందాడు. ఎంతసేపటికి పాము బయటకు రాకపోవడంతో.. బైక్‌ను నడిపేందుకు వెనక ముందు అయ్యాడు. ఇక ధైర్యం చేసి దగ్గరలో ఉన్న మెకానిక్ షాప్ వద్దకు తీసుకెళ్ళాడు. బైకులోకి పాము దొరడంతో అక్కడున్న జనాలు చూసేందుకు ఆసక్తి చూపారు. బైక్ మెకానికులు ఎంత చూసినా దొరకకపోవడంతో.. చివరికి బైక్ ఇంజన్ మొత్తం విప్పి కుప్పపెట్టారు.
పాము మాత్రం తెలివిగా ఇంజన్ లోపల వెళ్లి దాక్కోవడంతో.. దాగుడుమూతలు ఆడినంత పని అయింది. ఎట్టకేలకు మెకానిక్‌లు పామును బయటకు తీయడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నాడు. ఏదేమైనా పాము గంటసేపు అక్కడున్న జనాలకు చుక్కలు చూపించింది. పాము బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాము ఎలా దూరిందో అర్థం కావడం లేదంటున్నారు బైక్ యాజమాని.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..