
బస్సులు అటుంచితే.. దేశంలో చాలామంది ప్రయాణీకులు ఎక్కువగా తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు రైళ్లను వినియోగిస్తుంటారు. ఇక ప్రయాణీకులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారత రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్తగా ముందుకు వస్తోంది. అందులో భాగంగానే అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల విమానాశ్రయం తరహాలోనే రైల్వే స్టేషన్‌లోనూ స్లీపింగ్ పాడ్స్ తీసుకొచ్చింది. అది కూడా చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఇవి ప్రయాణీకులకు అందుబాటులో ఉండనున్నాయి. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు.. వారి అలసట తీర్చేందుకు తక్కువ ధరలో ఈ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. గుంటూరు రైల్వేస్టేషన్‌లో కూడా ఈ సదుపాయం ఉండగా.. ఇప్పుడు చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో అలాంటి సౌకర్యం ప్రయాణీకులు వినియోగించుకోవచ్చు.
చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఈ స్లీపింగ్ పాడ్స్‌లో మొత్తం 32 సింగిల్ బెడ్‌లు ఉన్నాయి. వీటిని సగం.. సగంగా పురుషులకు, మహిళలకు కేటాయించనున్నారు. ఈ స్లీపింగ్ పాడ్స్‌లో ఛార్జీలు ఇలా ఉండనున్నాయి.
2 గంటలకు: రూ. 200
6 గంటలకు: రూ. 400
12 గంటలకు: రూ. 800
24 గంటలకు (ఒకరోజు): రూ. 1200 చొప్పున ఛార్జీలుగా నిర్ణయించారు.
ఈ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యంతో పాటు స్టేషన్‌లో ఫ్రీ వైఫై, స్నాక్స్ బార్, బెడ్లు, 24 గంటల పాటు హాట్ వాటర్, లగేజీని భద్రపరుచుకోవడానికి లాకర్ లాంటి సౌకర్యాలను కూడా వినియోగించుకోవచ్చు. ఇన్ని సదుపాయాలను ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ తెలిపింది. ఈ తరహ సదుపాయం మొదట ముంబై రైల్వేస్టేషన్‌లో ప్రారంభించగా.. దానికి మంచి ఆదరణ లభించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి