
సిరిసిల్లలో ఓ హోటల్ నిర్వాహకుడు వినూత్న ప్రయోగంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో హోటల్ నిర్వహణ కష్టంగా మారిన నేపథ్యంలో సిరిసిల్లకు చెందిన మహేష్ అనే హోటల్ యజమాని డీజిల్‌తో పనిచేసే ప్రత్యేక స్టవ్ తయారు చేశారు. చిన్న విద్యుత్ మోటర్ సహాయంతో డీజిల్‌ను పొయ్యి దగ్గరకు పంపించి, అక్కడ మంట వెలిగే విధంగా ఈ స్టవ్ రూపొందించారు. అవసరాన్ని బట్టి మంటను పెంచడం, తగ్గించడం కూడా వీలవుతుంది. ఈ స్టవ్‌లో ఒక్కసారి డీజిల్ నింపితే గంట నుంచి రెండు గంటల వరకు నిరంతరంగా పనిచేస్తుందని మహేష్ తెలిపారు. గ్యాస్ సిలిండర్లతో పోలిస్తే ఖర్చు సగానికి తగ్గిందని ఆయన చెబుతున్నారు.
ఈ యంత్రాన్ని తయారు చేయడానికి సుమారు పది వేల రూపాయల ఖర్చు కాగా.. నాలుగు రోజుల పాటు శ్రమించి రూపొందించినట్లు వెల్లడించారు.
మహేష్ చేసిన ఈ వినూత్న ప్రయోగాన్ని చూసి మరికొంతమంది హోటల్ నిర్వాహకులు కూడా ఇలాంటి స్టౌలను తయారు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందిస్తున్న ఈ కొత్త ఆవిష్కరణ స్థానికంగా చర్చకు దారి తీసింది. తమకు కూడా ఇలాంటి స్టావ్‌లు అవసరమని హోటల్ యజమానులు చెబుతున్నారు. చాలామంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్లిపోతున్నారు.