
తెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్ధమైంది. మరో ఐదు రోజుల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనుండడంతో కోల్‌బెల్ట్‌లో పొలిటికల్ కాకరేగుతోంది. సింగరేణి ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 27న యథావిధిగా సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే.. కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో సింగరేణి ఎన్నికలను డిసెంబర్ 27కు బదులు.. వచ్చే ఏడాది మార్చ్‌లో నిర్వహించాలని రేవంత్‌రెడ్డి సర్కార్ కోరింది. కానీ.. ఇప్పటికే ఎన్నికలు పలుమార్లు వాయిదా పడ్డాయనీ, మళ్లీ వాయిదా వేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తామని గతంలో అండర్ టేకింగ్ ఇచ్చిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది.
దాంతో.. కోల్ బెల్ట్ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల్లో ఎన్నికల కాక షురూ కానుంది. హైకోర్టు ఆదేశాలతో సింగరేణిలో రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ పార్టీలతోపాటు మిగతా కార్మిక సంఘాలు కూడా సింగరేణి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. సింగరేణిలో ప్రస్తుతం రెగ్యులర్ కార్మికులు, ఉద్యోగులు కలిపి 42 వేల మంది, మరో 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఈ నెల 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో మాత్రం ఆఫీసర్లు మినహా దాదాపు 40 వేల మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక.. 13 కార్మిక సంఘాలు సింగరేణిలో గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి.
అనుబంధ యూనియన్లను గెలిపించుకునేందుకు ఎవరికివారు ప్రయత్నాలను మొదలు పెట్టారు. అటు.. 11 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సింగరేణి విస్తరించి ఉండగా.. ఆదిలాబాద్, పెద్దపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్‌సభ స్థానాల పరిధిలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే.. సింగరేణి ఎన్నికలతో కోల్‌బెల్ట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తొలి పరీక్ష ఎదుర్కోబోతున్నారు. కోల్ బెల్ట్ ఏరియాలోని 11 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఆసిఫాబాద్ మినహా.. 9 సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ గెలుపొందింది. దాంతో.. కాంగ్రెస్‌కు సింగరేణి ఎన్నికలు సవాల్‌గా మారనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి