Telangana: సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..

సర్పంచ్ పదవి ఇప్పుడు యువతలో రాజకీయ ప్రయాణానికి తొలి మెట్టుగా మారింది. పెద్ద పెద్ద ఉద్యోగాలను వదిలి, గ్రామాభివృద్ధి కోసం బరిలోకి దిగుతున్న వారి జాబితాలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామానికి చెందిన యువకుడు లావుడ్య రవీందర్ కూడా చేరాడు.

Telangana: సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..
Ravinder

Edited By: Ram Naramaneni

Updated on: Dec 06, 2025 | 7:58 PM

సర్పంచ్ పదవి అనేది చాలా కీలకం అయిపోయింది. రాజకీయాల్లో రాణించాలి అని అనుకునే వారు ముందు సర్పంచ్‌గా గెలిచి చూపించాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే చాలా మంది యువత.. తాము చేస్తున్న పెద్ద పెద్ద ఉద్యోగాలకు రాజీనామా చేస్తూ సర్పంచ్ ఎన్నికల బరిలో నిల్చుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో ఏకంగా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని సర్పంచ్‌గా బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.  వివరాల్లోకి వెళ్తే..సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ యజమాని లావుడ్య రవీందర్ పోటీ చేస్తున్నారు. ఇతను సొంతంగా హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ కంపెనీ నడుపుతున్నాడు. కాగా రవీందర్ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. హైదరాబాద్‌లో చిన్న సాఫ్ట్ వేర్ కంపెనీ స్థాపించి జీవితంలో స్థిరపడ్డానని, తన స్వగ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగానని రవీందర్ అంటున్నారు.

హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వస్తూ వెళ్తున్న సమయంలో గ్రామంలో సమస్యలను, చేయాల్సిన పనులను గుర్తించి తన సొంత ఖర్చులతో చేయించానన్నారు. గత మూడేళ్లుగా గ్రామంలో సొంతంగా పలు అభివృద్ధి పనులను చేయిస్తున్నానని, ఇప్పుడు నేరుగా గ్రామాభివృద్ధి చెయ్యాలనే ఉద్దేశంతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగానన్నారు.వచ్చే ఐదేళ్లు గ్రామానికి సేవ చేయాలనుకుంటున్నడు..ఇక అభివృద్ధి పనుల మేనిఫెస్టోను కూడా రూపొందించా నన్నారు..తనను సర్పంచ్ గా గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో జిల్లెల్లగడ్డ గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఓ రోల్ మోడల్ గ్రామంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. హైదరాబాద్‌లో సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్న ఈయన పంజాబ్‌లోని LPUలో బీటెక్ చదివారు. రెండేళ్లు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేశారు. తర్వాత ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్)లో ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగంలో ఎంబీఏ పూర్తి చేశారు..తర్వాత యూరప్ వెళ్లి కొంతకాలం ఉద్యోగం చేశారు. తర్వాత హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించారు. జిల్లెలగడ్డ గ్రామ సర్పంచి పదవిని ఎస్టీ జనరల్‌కు కేటాయించడంతో రవీందర్ రంగంలోకి దిగారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.