
శంషాబాద్: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి నకిలీ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నల్లగొండ జిల్లాకు చెందిన రమావత్ రాము, రమావత్ మోతిలాల్, రమావత్ గాంధీ, సుధీర్ కలిసి నకిలీ నోట్ల తయారీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేయగా.. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లోని రీల్స్ ద్వారా నకిలీ నోట్లు తయారు చేసే విధానాన్ని తెలుసుకున్న నిందితులు.. రూ.500, రూ.200, రూ.100 నోట్లను తయారు చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం రాత్రి వేళల్లో మద్యం దుకాణాలు, పాన్ డబ్బాల వద్ద నకిలీ నోట్లను చలామణి చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు.
నకిలీ కరెన్సీ చలామణిపై సమాచారం అందడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.2,91,100 విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల తయారీకి ఉపయోగించిన కలర్ ప్రింటర్, లామినేటర్, ఇంక్ డబ్బాలు, ఇతర ముడిసరుకులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో నకిలీ కరెన్సీ తయారీ లేదా చలామణికి సంబంధించిన కంటెంట్‌ను ప్రచారం చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ కేఎస్ రావు హెచ్చరించారు.