నకిలీ వెండి మోసం! పైపై మెరుపులతో నిండా ముంచేశారు!

సికింద్రాబాద్‌లో నకిలీ వెండి బార్లతో వ్యాపారులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. రూ.15 లక్షల నష్టం వాటిల్లగా, 8.4 కిలోల నకిలీ వెండి స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ వెండి మోసం! పైపై మెరుపులతో నిండా ముంచేశారు!
Silver 3

Edited By:

Updated on: Apr 25, 2026 | 9:50 PM

సికింద్రాబాద్‌లో నకిలీ వెండి బార్లతో వ్యాపారులను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్‌లోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా, ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చిన హృదేష్ కుమార్, సుశీల్ కుమార్, ప్రిన్స్ అలా లడ్డు, రాజీవ్ జైన్, సోనా కుషావలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీ జగదంబ ఇండస్ట్రీస్ యజమాని హీరాలాల్ వర్మను లక్ష్యంగా చేసుకుని నిందితులు ఈ మోసానికి పాల్పడ్డారు. మొదట రెండు సార్లు నిజమైన వెండి సరఫరా చేసి నమ్మకం పొందిన ముఠా, మూడోసారి 6.35 కిలోల నకిలీ వెండి బార్లను అసలైనవిగా చూపించి విక్రయించింది. దీనితో బాధితుడికి సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. అయితే అనుమానం రావడంతో పరీక్ష చేయించగా, ఆ బార్లలో ఒక్క శాతం వెండి కూడా లేనట్టు తేలింది.

దర్యాప్తులో భాగంగా మహంకాళి, మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 12 కిలోలకుపైగా నకిలీ వెండి బార్లతో మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 8.4 కిలోల వెండి బిస్కెట్లు, రూ.1.5 లక్షల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును మహంకాళి పోలీస్ అధికారులు, ఏసీపీ, అదనపు డీసీపీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందం విచారించి నిందితులను పట్టుకుంది. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రతి లావాదేవీకి ముందు వెండి నాణ్యతను తప్పనిసరిగా పరీక్షించుకోవాలని, అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వ్యాపారులకు సూచించారు. ఈ ముఠా కార్యకలాపాలు ఒడిశా, ఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరిన్ని సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us