
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో వార్డు స్థాయి ఫలితాలు వచ్చాక.. రాజకీయ పోరు ఇప్పుడు రెండో దశకు చేరింది. అంటే.. ఛైర్మన్, మేయర్‌ల పరోక్ష ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు కీలకంగా మారనున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫిబ్రవరి 16న పరోక్ష ఎన్నికలు నిర్వహించనుంది. అనేక మున్సిపాలిటీల్లో స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో.. ఒకటి, రెండు వార్డుల తేడాతో గెలుపు ఓటములు తేలే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఓట్లు కీలక భూమిక పోషించనున్నాయి. అయితే.. ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటింగ్ హక్కులపై SEC కీలక స్పష్టత ఇచ్చింది. ఫిబ్రవరి 13 తేదీతో విడుదల చేసిన సర్క్యులర్‌లో.. 2021 తెలంగాణ హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. ఎవరు ఓటు వేయొచ్చు.. ఎవరు వేయలేరో క్లియర్ చేసింది. అసలు ఎవరు..? ఎక్కడ ఓటు వేయొచ్చు అనే అంశాలు ఇఫ్పుడు తెలుసుకుందాం.
లోక్ సభ ఎంపీ, ఎమ్మెల్యే: సంబంధిత మున్సిపాలిటీ పరిధి పూర్తిగా లేదా కొంత భాగంగా వారి నియోజకవర్గంలో ఉండాలి. అప్పుడే ఎక్స్ అఫీషియో ఓటు వేసే వీలుంటుంది. ఉదాహారణకు ఒక MLA నియోజకవర్గంలో మున్సిపాలిటీ-A లో 6 వార్డులు, మున్సిపాలిటీ-B లో 4 వార్డులు ఉంటే.. ఆ MLAకి A లోనూ, B లోనూ ఓటు హక్కు ఉంటుంది. అయితే ఏదైనా ఒక మున్సిపాలిటీలో మాత్రమే కో ఆప్షన్ ఓటు వినియోగించుకునే చాన్స్ ఉంటుంది. రెండు చోట్ల వేయడం కుదరదు.
రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలు: వారికి టెర్రిటోరియల్ నియోజకవర్గం ఉండదు. కాబట్టి.. ఆ మున్సిపాలిటీ పరిధిలో ఓటరుగా నమోదు అయి ఉంటేనే ఓటు హక్కు ఉంటుంది.
ఈ ప్రమాణాలు లేని సభ్యులు ఓటు వేస్తే.. ఆ ఓటు నల్ అండ్ వాయిడ్ అని స్టేట్ ఎలక్షన్ కమిషన్ స్పష్టం చేసింది. అంటే ఆ ఓట్లు చెల్లవన్నమాట. ఈ సర్క్యులర్‌కి భారీ రాజకీయ ప్రాధాన్యం ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో.. కొన్ని పార్టీలు రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్సీలను కీలక మున్సిపాలిటీల్లో సెటప్ చేసి సంఖ్య పెంచుకునే ప్రయత్నాలు చేసేవి. ఇప్పుడా స్కోప్ తగ్గిపోయింది.
ముఖ్యంగా ఆ మున్సిపాలిటీ ఓటరు లిస్ట్‌లో పేరు లేకపోతే.. రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదు. ఎక్స్ అఫీషియో సభ్యులకు.. ఎన్నికైన కౌన్సిలర్, కార్పొరేటర్‌తో సమానంగా ఓటు హక్కు ఉంటుంది. అందుకే.. ఛైర్మన్, వైస్ ఛైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా నిర్ణయాత్మకంగా మారుతుంది. ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి కార్పొరేషన్లు రాజకీయంగా కీలకంగా మారడంతో.. పార్టీలు అర్హత ఉన్న ఎక్స్ అఫీషియో సభ్యుల్ని సంఖ్య ఆధారంగా ఖచ్చితంగా కేటాయించాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్ని బట్టి ఫిబ్రవరి 16న జరిగే పరోక్ష ఎన్నికలే పార్టీలకు అసలు రాజకీయ పరీక్ష అని చెప్పాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..