
హైదరాబాద్ నగరంలో టేస్టీ ఫుడ్ దొరుకుతుంది.. అలానే హెల్తీ ఫుడ్ కూడా దొరుకుతుంది. కానీ టేస్టీ అండ్ హెల్తీ ఫుడ్ దొరకడం చాలా రేర్. అలా కష్టపడి బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రజల నమ్మకాన్ని చూరగొన్నారు. అయితే అలాంటివారికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది. పేర్ల చివర, మొదలు కనిపించని విధంగా ఫేమస్ బ్రాండ్స్ పెడుతూ.. కస్టమర్స్ ని మోసం చేస్తున్నారు. పేరు చూసి పోయి.. అక్కడ తినేటప్పుడు క్వాలిటీ, సర్వీస్ చూసి కంగుతినడం ప్రజల వంతు అవుతుంది.
తాజాగా సంతోష్ దాబా ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించి వ్యాపారాలు నడుపుతున్న వివిధ దాబాలపై కోర్టు ఆదేశాలతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఒరిజినల్ ఓనర్ సంతోష్ దాబా యజమానిసునీల్ సాంక్లా, మనోజ్ కుమార్ సాంక్లా తమ పేరును దుర్వినియోగం చేస్తున్నారని సిటీ సివిల్ కోర్టులో కేసు వేశారు. తమ బ్రాండ్ పేరుతో అక్రమంగా నగరంలోని పలు ప్రాంతాల్లో శ్రీ బాలాజీ సంతోష్ దాబా వంటి పేర్లు పెట్టుకొని నడిపిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సిటీ సివిల్ కోర్టులో వేసిన కేసుపై న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
అక్రమంగా పేరును దుర్వినియోగం చేస్తున్న బోర్డులను తొలగించాలని ఆదేశించింది. దీనితో బేగంబజార్‌లోని సంతోష్ దాబా పేరుతో మాయ చేస్తున్న ఓ బోర్డును గోషామహల్ పోలీసుల సమక్షంలో తొలగించారు. అక్రమంగా శ్రీ సంతోష్ దాబా పేరుతో పెట్టుకొని.. నిజమైన సంతోష్ దాబా పేరుతో వినియోగదారులను మోసం చేస్తున్నారని.. మనోజ్ కుమార్ తరుపు న్యాయవాది అభిషేక్ అగర్వాల్ తెలిపారు. నగరంలోని హిమాయత్ నగర్, అబిడ్స్, సోమాజిగూడా, అమీర్ పెట్, అత్తాపూర్, మలక్ పేట్ తదితర ప్రాంతాల్లో సంతోష్ దాబా పేరుతో అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్నారని తెలిపారు. కోర్టు ఆదేశాలతో నగరంలో ఉన్న సుమారు 50 దాబాల బోర్డులను తొలిగించనున్నట్లు పేర్కొన్నారు. పేర్లతో బోల్తా కొట్టించి.. ప్రజారోగ్యంతో జనారోగ్యంతో చెలగాటం ఆడుతున్నవారిపై తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.