సమతాకుంభ్‌ ఉత్సవాలు.. శాంతి కళ్యాణ మహోత్సవం కమనీయం.. రమణీయం

కళ్యాణం అంటే మంగళం కలుగజేసేదని అర్థం. అలాంటి మహోత్సవం సమతాకుంభ్‌ 2025 బ్రహ్మోత్సవాల్లో కన్నుల పండువగా సాగింది. 108 దివ్యదేశాల పెరుమాళ్లకు ఒకే వేదికపై ఏకకాలంలో శాంతి కల్యాణ మహోత్సవం అంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. 108 రూపాల్లో  కొలువైన ఆ విభువు సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారని భక్తులు నమ్ముతారు.  

సమతాకుంభ్‌ ఉత్సవాలు.. శాంతి కళ్యాణ మహోత్సవం కమనీయం.. రమణీయం
Samatha Kumbh

Updated on: Feb 15, 2025 | 9:04 PM

శ్రీ రామానుజాచార్య- 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఘట్టము పరమానంద భరితం. సకల లోక రక్షకుడికి, సర్వరూప ధరుడికి, సర్వనామ సంకీర్తికి 108 రూపాలలో జరిగిన అపూర్వ ఉత్సవం ఇది. సమతాకుంభ్‌ 2025 బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శనివారం ఒకే వేదికపై శ్రీరంగం నుంచి వైకుంఠం వరకు 108 దివ్యదేశాల పెరుమాళ్లకు  శాంతి కల్యాణం జరిగింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ వేడుక సాగింది. రామానుజ సన్నిధిలో తప్ప మరెక్కడా కనిపించని ఈ కల్యాణ మహోత్సవాన్ని చూడడం అంటే, పూర్వజన్మ సుకృతం అని చెబుతారు.

లక్ష్మీ అంటే దయ, భూదేవి అంటే క్షమ. ఇద్దరినీ కలుపుకొని అందరినీ రక్షించేందుకు స్వామివారు కళ్యాణం జరుపుకుంటారు. ఈ కళ్యాణాన్ని వీక్షించడం వల్ల ఆ భగవంతుడు 108 రూపాల్లో మనకి సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగా విష్ణు సేనాధిపతి విష్వక్సేనుడికి ఉపచారాలను సమర్పించి, వారి అనుగ్రహాన్ని అక్షత రూపంలో స్వీకరించి వాసుదేవ పుణ్యాహవచనం జరిపించారు. మంత్రపూరితమైన జలంతో ప్రోక్షణ చేస్తేనే కళ్యాణానికి యోగ్యత వస్తుంది. స్వామి, అమ్మవార్లను కూర్చోబెట్టి ఇద్దరి గోత్రనామాలను ప్రవరానుసంధానం చేశారు. తేనె, పెరుగు కలిపిన మధుపర్క మిశ్రమాన్ని స్వామికి సమర్పించారు దంపతులకు పట్టు వస్త్రాలను సమర్పించారు. ఎల్లవేళలా మంగళం కలగాలని మంగళాష్టకాలను చదివారు.

గోదానం.. భూదానం  సువర్ణ దానం..అలా  సంపూర్ణంగా  16 దానాలు చేశారు. సుమూర్తం సమయంలో శుభప్రదంగా  జీలకర్ర, బెల్లం సమర్పించారు. మంగళసూత్రంలో లక్ష్మీ అమ్మవారిని ఆవాహన చేసి పూజలు చేశారు. స్వామి అనుజ్ఞతో అర్చకుడి ద్వారా దివ్యమంగళసూత్రధారణ… సుమంగళ అక్షితల సమర్పణతో  శాంతి కల్యాణోత్సవం కనుల పండువను తలపించింది. ఇదంతా  రామానుజార్య దివ్యాజ్ఞ. శుభ ముహుర్తాన  శాంతి మహాకల్యాణం కన్నుల విందుగా సాగింది. అయ్యవారికి  అమ్మవారు.. అమ్మవారి అయ్యవారు.. పరస్పర మాలధారణ చేశారు.  భక్తి ప్రపత్తితో  దేవదేవేరీలకు నైవేద్యాలను నివేదించారు పండితులు. ఇలాంటి కళ్యాణాలను ఎన్నో జరిపించుకునేలా దీవించమని వేడుకున్నారు.

దేవాది దేవుళ్లు దివి నుంచి భువికి దిగి వచ్చిన వేళ..  వైదిక వెలుగులతో ముచ్చింతల్‌ మురిసిపోయింది. ఇది రామానుజ దివ్యాజ్ఞ… శ్రీ శ్రీ శ్రీ చినజీయర్‌ స్వామి సత్య సంకల్ప సాకారం…రామానుజార్య దివ్యాజ్ఞా వర్ధతాం! అభివర్ధతామ్!!. సాకేత రామయ్య సారధ్యంలో దేవుళ్ల పెళ్లిని ఇలా  కళ్లారా  వీక్షించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. ఒక్కచోట జరిగే 108 కల్యాణాలు అద్భుతాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తే … 108 రూపాల్లో  కొలువైన ఆ విభువు సకల జనులపై సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తారని నమ్మకం. భక్తితో సమర్పించే పుష్పాలను సంతోషంగా స్వీకరించే  కారుణ్య మూర్తి ఆ విభువు. అలాంటిది మనసును పువ్వులుగా సమర్పిస్తే.!  ఆ భగవంతుడు దివి నుంచి భువికి రాకుండా వుంటాడా! శాంతికళ్యాణ మహోత్సవం సందర్భంగా ముచ్చింతల్‌ ఇల వైకుంఠపురాన్ని తలపించింది.