Telangana: ఓదెలలో అనుమానాస్పదంగా ఆరుగురు వ్యక్తులు.. ఆపి బ్యాగులు చెక్ చేయగా

ఓదెల రైల్వే స్టేషన్.. ఈ టైటిల్ మీకు గుర్తుండిపోతుంది. దీనిపై ఓ సినిమా కూడా వచ్చి.. లాక్‌డౌన్ టైంలో సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే స్టోరీ కొంచెం డిఫరెంట్. ఓదెలలో ఆరుగురు వ్యక్తులు కొంచెం అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. వారిని ఆపి చెక్ చేయగా..

Telangana: ఓదెలలో అనుమానాస్పదంగా ఆరుగురు వ్యక్తులు.. ఆపి బ్యాగులు చెక్ చేయగా
Odela

Updated on: May 03, 2025 | 4:24 PM

జల్సాలకు అలవాటు పడి మత్తు పదార్థాలు అమ్మి, సొమ్ము చేసుకుంటున్న ముఠాను పట్టుకున్నారు పెద్దపల్లి పోలీసులు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో 4,80,000 రూపాయలు విలువ గల తొమ్మిదిన్నర కేజీల గంజాయిను తరలిస్తున్న ఆరుగురు వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్నామని అన్నారు పెద్దపల్లి డిసిపి కరుణాకర్. గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను పోత్కపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, అంతర్గాం సమీప గ్రామాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు ఒడిస్సా రాష్ట్రం నుండి 2500 రూపాయలకు కిలో చొప్పున గంజాయిని కొనుగోలు చేసి, రైలు మార్గంలో తరలించి, పెద్దపల్లి జిల్లాలో విక్రయించేందుకు వెళుతుండగా పోత్కపల్లి పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. కూలీలు, విద్యార్థులను టార్గెట్‌గా చేసుకొని ఒడిస్సా రాష్ట్రం నుండి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఈ ప్రాంతానికి తీసుకొచ్చి వ్యాపారంగా మలుచుకున్నారు ఈ ఆరుగురు వ్యక్తులు. కాగా, వీరి వద్ద నుండి 9. 64 కిలోల గంజాయి, మోటార్ సైకిల్, రెండు సెల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు డిసిపి కరుణాకర్.