ఎంత పని చేశావ్ భారతీ.. కాసుల కోసం కక్కుర్తితో సుపారీ ఇచ్చిమరీ భర్త హత్య!

రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం ఓ భార్య కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించిన ఘటన మంచిర్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య తన ప్రియుడుతో కలిసి హత్యకు కుట్ర పన్నారు. ఆపై రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశారు. చివరకు పోలీసులు రంగంలోకి దిగడంతో మొత్తం బండారం బయటపడింది..

ఎంత పని చేశావ్ భారతీ.. కాసుల కోసం కక్కుర్తితో సుపారీ ఇచ్చిమరీ భర్త హత్య!
Wife Kills Husband For Insurance Money

Updated on: May 27, 2026 | 12:28 PM

మంచిర్యాల, మే 27: భర్త పేరిట తీసుకున్న రూ.2 కోట్ల బీమా సొమ్ము కోసం భార్యే కట్టుకున్న భర్త హత్యకు కుట్ర పన్నిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ వెల్లడిస్తూ సంచలన విషయాలను తెలిపారు. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామానికి చెందిన సాయిని కుమార్‌ (45) మే 22న ద్విచక్రవాహనంపై మంచిర్యాల వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని 108 అంబులెన్స్‌లో కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. అయితే ఘటనపై అనుమానం వ్యక్తం కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడు కుమార్‌ భార్య భారతి, అదే గ్రామానికి చెందిన లగిశెట్టి సురేందర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఇద్దరూ.. అతడిని హత్య చేయాలని ప్రణాళిక రచించారు. ఈ క్రమంలోనే 2025 జనవరి నుంచే కుమార్ పేరిట ఎల్‌ఐసీతో పాటు పలు బీమా పాలసీలు తీసుకుని ప్రీమియంలు చెల్లిస్తున్నట్లు తేలింది. కుమార్‌ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే సుమారు రూ.2 కోట్ల బీమా సొమ్ము వస్తుందని భావించారు. దీంతో కుమార్‌ హత్యకు కట్ర పన్నారు.

కుమార్‌కు అప్పు ఇచ్చిన గుడిపేటకు చెందిన రామ్ మల్లేశ్‌తో ఈ కుట్రకు భారతి, సురేందర్‌లు చేతులు కలిపారు. భర్తను హత్య చేస్తే రూ.10 లక్షల సుపారీ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు ముందస్తుగా రూ.2 లక్షలు చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం మల్లేశ్‌, మంచిర్యాల ఎల్‌ఐసీ కాలనీకి చెందిన శ్రీరామ్‌తో కలిసి హత్యకు పథకం రచించాడు. పథకం ప్రకారం ఈ నెల 22న ముల్కల్ల గ్రామ శివారులో కుమార్‌కు అధికంగా మద్యం తాగించి, ఇనుప సుత్తితో తలపై దాడి చేశారు. అనంతరం ఘటనను రోడ్డు ప్రమాదంగా చూపించేందుకు అతడిని, ద్విచక్రవాహనాన్ని రోడ్డు పక్కన పడేసి నిందితులు పరారయ్యారు.

అప్పటి వరకూ అంతా కుమార్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడనే అనుకున్నారు. కానీ కుమార్‌ తల్లి లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసును లోతుగా విచారించగా అసలు సంగతి బయటపడింది. భారతి ప్రవర్తన, సురేందర్‌తో ఉన్న సంబంధం అనుమానాలకు దారితీసింది. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌ పర్యవేక్షణలో సీఐ రవీందర్‌ దర్యాప్తు జరిపి ప్రమాదంగా కనిపించిన ఘటనను హత్యగా నిర్ధారించారు. ఈ కేసులో భారతి, సురేందర్‌, శ్రీరామ్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు రామ్ మల్లేశ్‌ పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి బీమా పత్రాలు, రూ.25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us