ఆదిలాబాద్ రిమ్స్‌లో ఘోరం.. ఏసీ పేలి ఇద్దరు శిశువుల మృతి..
ఆదిలాబాద్ రిమ్స్‌లోని స్పెషల్ కేర్ నియోనాటల్ యూనిట్‌లో అర్ధరాత్రి ఏసీ యూనిట్‌కు సంబంధించిన ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఇద్దరు నవజాత శిశువులు మృతి చెందినట్లు సమాచారం. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, పలువురు చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో NICUలో 27 మంది శిశువులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

ఆదిలాబాద్ రిమ్స్‌లో అర్ధరాత్రి ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏసీ యూనిట్ పేలడంతో.. కనీసం నెల కూడా నిండని చిన్నారులు ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ముక్కుపచ్చలారని చిన్నారులు పుట్టిన కొన్ని రోజుల్లోనే చనిపోవడంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. రిమ్స్‌లోని స్పెషల్ కేర్ నియోనాటల్ యూనిట్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో ఏసీ పేలింది. ఈ ప్రమాదంలో ఓ నవజాత శిశువు స్పాట్‌లోనే చనిపోగా, మరొక చిన్నారి ప్రైవేట్ ఆస్పత్రికి తలిస్తుండగా చనిపోయినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో NICU వార్డులో 27మంది చిన్నారులున్నారు. పలువురు చిన్నారులకు గాయాలు కాగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. గాయపడిన చిన్నారులకు 4 ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.
నియోనాటల్ యూనిట్‌లో అప్పుడే పుట్టిన చిన్నారులు మాత్రమే ఉంటారు. కామెర్లు, శ్వాస కోస ఇబ్బందులు, నెలలు నిండక ముందే పుట్టిన నవజాత శిశువులకు ఈ నియోనాటల్ యూనిట్‌లో చికిత్స అందిస్తారు. ఏసీ పేలడంతో NICU వార్డ్ మొత్తం దట్టంగా పొగ అలుముకుంది. దాంతో.. డోర్ అద్దాలు పగలగొట్టి చిన్నారులను రక్షించారు. పొగను పీల్చడంతో.. ఇద్దరు చిన్నారులు కండిషన్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రమాదం తర్వాత అక్కడున్న రోగులు, వారి బంధువులు ఆందోళనకు గురయ్యారు. ఆసుపత్రి నుంచి బయటకు చిన్నారులను తీసుకుని పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యామంటున్నారు తల్లులు.
ప్రమాద సమయంలో NICU నుంచి బయటకు తీసుకొచ్చిన ఐదుగురు చిన్నారులకు గణేష్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఆదిలాబాద్ రిమ్స్ లో చిన్నారుల మృతిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.. కాగా, ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.
తక్షణమే విచారణ మొదలు పెట్టాలి: మంత్రి దామోదర్ రాజనర్సింహ
ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులతో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం పట్ల మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నారుల కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని మంత్రి ప్రార్థించారు. ఆ కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. ఘటనా సమయంలో వార్డులో ఉన్న మిగిలిన చిన్నారులందరి పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరికీ సమస్య లేదని అధికారులు మంత్రికి వివరించారు. పిల్లలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని మంత్రి సూచించారు. అగ్ని ప్రమాదానికి గల కారణంపై తక్షణమే విచారణ మొదలు పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
