
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళల భద్రత, సాధికారతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి సందర్భంలో వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో నిర్వహించిన ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల రక్షణ, అభ్యున్నతికి కేవలం చట్టాలు చేయడం మాత్రమే సరిపోదని, వాటిని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసినప్పుడే ప్రభుత్వాల బాధ్యత పూర్తవుతుందని అన్నారు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నింటిలోనూ మహిళల పాత్ర ఎంతో కీలకమని గుర్తు చేశారు. అదే విధంగా తెలంగాణ అభివృద్ధిలో కూడా మహిళలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. మహిళల ప్రతిభను గుర్తించి వారికి తగిన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు వివిధ రంగాల్లో కీలక పదవులు ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలోని పలు సంక్షేమ పథకాలను మహిళల పేరుపైనే అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని తెలిపారు. అదే సమయంలో మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ ఆర్టీసీలో వెయ్యి బస్సులను మహిళా సంఘాల ద్వారా నడిపిస్తున్నామని చెప్పారు. దీంతో వారు కేవలం లబ్ధిదారులుగానే కాకుండా వ్యాపార భాగస్వాములుగా కూడా ఎదుగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ వంటి ప్రముఖ ప్రాంతం సమీపంలో మహిళలు తయారు చేసే ఉత్పత్తుల విక్రయానికి ఇందిరా మహిళా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గ్రామీణ మహిళలు తయారు చేసే స్థానిక ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని మహిళలను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.