Telangana CM: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి

| Edited By: Ravi Kiran

Dec 07, 2023 | 3:42 PM

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్‌, ఇతర పార్టీలకు చెందిన ముఖ్యనేతలు ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.

Telangana CM: సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy
Follow us on

రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో కిక్కిరిసన జనసందోహం, అగ్రనేతల సమక్షంలో రేవంత్‌తో ప్రమాణం చేయించారు గవర్నర్‌ తమిళిసై.  రేవంత్‌ ప్రమాణం స్వీకారం తర్వాత మరో 11 మంది మంత్రులు వరుసగా ప్రమాణస్వీకారం చేశారు. వారితో గవర్నర్‌ తమిళిసై రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేయించారు.  సీఎంతోపాటు డిప్యూటీ సీఎంగా భట్టి, మంత్రులుగా కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌, జూపల్లి, పొంగులేటి, తుమ్మల, రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్‌ ప్రమాణం చేశారు.

రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి AICC అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ఖర్గే, ప్రియాంకతోపాటు కీలక నేత కేసీ వేణుగోపాల్‌, హిమాచల్‌ గవర్నర్‌ సుఖ్విందర్‌సింగ్‌ హాజరయ్యారు. రేవంత్‌ అను నేను అంటూ సీఎంగా రేవంత్‌ రెడడి ప్రమాణం చేస్తుండగా సభా ప్రాంగణం జయజయధ్వానాలతో మార్మోగింది. అభిమానులు ఈలలు, కేకలతో హోరెత్తించారు.  ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒకరినొకరు కౌగిలించుకుని ప్రజలకు అభివాదం చేశారు.

ప్రమాణస్వీకారోత్సవ వేదికపై రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రేవంత్‌ భార్యతోపాటు కూతురు, అల్లుడు, మనువడు హాజరయ్యారు. రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారోత్సవంతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిసిపోయాయి. కళాకారుల డప్పుదరువులు, ఆటపాటలు, మహిళలు బోనాలతో రావడంతో స్టేడియం సందడిగా మారింది. ఎల్బీ స్డేడియం ముందు లంబాడీ వేషధారణలో మహిళలు నృత్యాలతో ఆకట్టుకున్నారు. వేపమండలతో చిన్నారుల డ్యాన్సు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…