
వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామ శివారులో ఓ అరుదైన పాము దర్శనమిచ్చింది. రోడ్డుపై వెళ్తున్న బాటసారులకు రొడ్డుపై ఏదో మెరుస్తూ కనిపించింది. అయితే తొలుత దాన్ని పామును చూసిన స్థానికులు బొమ్మ అనుకున్నారు.. కానీ దాని కదలికలు గమనించి కాస్త దగ్గరకెళ్లి చూడగా.. ఆదో వింతరకం పాముగా గుర్తించారు.. ఇలాంటి పాము మునుపెప్పుడు కనిపించక పోయే సరికి కంగారుపడిన స్థానికులు వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించారు.
దీంతో అటవీ అధికారులతో పాటు స్నేక్ క్యాచర్ సైతం హుటాహుటిన అక్కడికి చేరుకుని పామును పరిశీలించారు. అయితే నలుపు–పసుపు చారలతో ఉన్న ఈ పాము బాండెడ్ క్రేట్ (కట్టు విరియన్)గా అధికారులు గుర్తించారు. దాదాపు 5 అడుగుల పొడవు ఉన్న ఈ పామును చాకచక్యంగా పట్టుకొని సమీప అడవుల్లో వదిలేశారు. ఈ పాము చాలా విషపూరితమైనదని, ఇది కరిస్తే బ్రతకడం కూడా కష్టమని తెలిపారు. సాధారణంగా ఇది రాత్రివేళల్లో సంచరిస్తుందన్నారు.
ఈ పాము ఎక్కువగా చైనా, నేపాల్, థాయిలాండ్ , కాంబోడియా వియత్నం లాంటి దేశాలలో కనిపిస్తుందని.. మనదేశంలో అయితే జార్ఖండ్, ఛత్తీస్గడ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అరుదుగా కనిపిస్తుందన్నారు. ఈ పాము దారితప్పి లేదా లారీల్లో పడిపోయి ఈ ప్రాంతానికి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. ఇలాంటి పాములు ఎక్కడైన కనిపిస్తే.. వాటిని పట్టుకునేందుకు ప్రయత్నించకుండా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు జనాలకు తెలిపారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.