అంతా వాన కోసమే.. సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణ యాగం వరకు.. అసలు లెక్కేంటి?

వర్షాల కోసం ప్రభుత్వాలు యాగాలు నిర్వహించడం తెలుగు రాష్ట్రాల్లో కొత్తేమీ కాదు. తాజాగా నాగార్జునసాగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో మహా వరుణయాగం జరగడంతో.. యాగం చేస్తే నిజంగానే వర్షాలు పడతాయా? యాగం తర్వాత వర్షం వస్తే దానికి కారణం యాగమేనా? అనే చర్చ మొదలైంది. వర్షపాతాన్ని రుతుపవనాలు, అల్పపీడనాలు, వాయుగుండాలు, గాలుల కదలికలు, తేమ, ఎల్‌నినో, లా నినా వంటి అనేక వాతావరణ అంశాలు ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అంతా వాన కోసమే.. సీఎంల సెంటిమెంట్‌ నుంచి నాగార్జునసాగర్‌ వరుణ యాగం వరకు.. అసలు లెక్కేంటి?
Nagarjuna Sagar Varuna Yagam

Edited By:

Updated on: Aug 10, 2026 | 8:13 PM

వర్షం కోసం రైతు ఆకాశం వైపు చూస్తాడు. ప్రభుత్వం వాతావరణ శాఖ వైపు చూస్తుంది. కానీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో మరో దృశ్యం తరచూ కనిపిస్తుంది. వరుణుడి అనుగ్రహం కోసం యాగాలు, జపాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి ఇదే చర్చ మొదలైంది. ఎల్‌నినో ప్రభావం రాష్ట్రంపై ఉండొద్దు, వర్షాలు సమృద్ధిగా కురవాలి, ప్రాజెక్టులు నిండాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వరుణయాగం పూర్తైంది. నాగార్జునసాగర్ విజయ్‌విహార్‌లో మహా వరుణయాగం జరిపారు. బ్రహ్మముహూర్తంలో ఉత్తమ్ దంపతుల పూజలతో యాగం ప్రారంభమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా వరుణ యాగంలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో.. 108 మంది ఋత్వికులు, 11 హోమగుండాలతో యాగం పూర్తి చేశారు. వరుణయాగంలో కీలక ఘట్టమైన మహా పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులకు జలకళ రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108మంది ఋత్వికుల వేద మంత్రోచ్ఛరణల మధ్య పూర్ణాహుతి కార్యక్రమం ముగించారు.

అయితే అసలు ప్రశ్న.. యాగం చేస్తే వర్షం పడుతుందా? యాగం తర్వాత వర్షం పడితే.. దానికి కారణం యాగమేనా? కోట్ల నుంచి రేవంత్‌ వరకు.. వర్షాల కోసం ప్రభుత్వ స్థాయిలో యాగాలు చేయడం కొత్త కాదు. గతంలో చాలా సార్లు వరుణయాగం చేశారు.

గతంలో యాగాలు..

1993లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో రాష్ట్రంలోని 50 ఆలయాల్లో వరుణ జపం నిర్వహించారు. 11 రోజుల పాటు కార్యక్రమాలు జరిగినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదని అప్పటి నివేదికలు చెబుతున్నాయి.

2008లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి హైదరాబాద్‌లో మహావరుణ యాగంలో పాల్గొన్నారు. 2009లోనూ ఆయన హయాంలో మరో మహావరుణ యాగం జరిగింది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత 2016లో అప్పటి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వర్షాల కోసం ఆలయాల్లో వరుణ జపాలు, యాగాలు నిర్వహించాలని ఆదేశించారు.

2019లో అప్పటి సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు సందర్భంగా జల సంకల్ప యాగం నిర్వహించారు.

2023లో టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల, శ్రీనివాస మంగాపురంలో వరుణ యాగాలు జరిగాయి. మంచి వర్షాల కోసం ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. యాగంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డి పాల్గొన్నారు.

2026లో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో ఆలయాల్లో వరుణ యాగాల కార్యక్రమాలు జరిగాయి. యాదాద్రి, చిలుకూరు బాలాజీ సహా పలు ప్రాంతాల్లో వర్షాల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఇప్పుడు ఈ వరుసలో నాగార్జునసాగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి–మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వరుణ యాగం చేరింది.

యాగం తర్వాత వర్షం.. లెక్క ఏం చెబుతోంది?

ఇక్కడే అసలు ఫ్యాక్ట్‌ చెక్‌ అవసరం. కొన్ని సందర్భాల్లో యాగం తర్వాత వర్షాలు వచ్చాయి. కానీ యాగం వల్లే వర్షం వచ్చింది అని నిరూపించే శాస్త్రీయ ఆధారం లేదు.

ఉదాహరణకు 2024 సెప్టెంబర్‌ 1న జరిగిన యాగం తర్వాత తెలంగాణలో ఏకంగా 97.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణం కేవలం 5.2 మిల్లీమీటర్లు. అంటే సాధారణం కంటే 1,781 శాతం అధికం. సూర్యాపేటలో 247 మి.మీ., మహబూబాబాద్‌లో 257 మి.మీ, ఖమ్మంలో 192 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాలకు వాతావరణ వ్యవస్థలే కారణమని IMD నివేదికలు పేర్కొన్నాయి.

అంటే..యాగం జరిగింది.. వర్షం వచ్చింది అనేది ఒక సంఘటన. యాగం వల్లే వర్షం వచ్చింది అనేది శాస్త్రీయంగా నిరూపించాల్సిన మరో విషయం.

యాగంలో వేసే పదార్థాలు ఏం చేస్తాయి?

యాగంలో నెయ్యి, సమిధలు, ధాన్యాలు, నువ్వులు, ఔషధ మొక్కల పదార్థాలు వంటి వాటిని అగ్నిలో వేస్తారు. అవి కాలినప్పుడు పొగ, నీటి ఆవిరి, కార్బన్‌ డయాక్సైడ్‌, ఇతర వాయువులు, సూక్ష్మ కణాలు (aerosols) వాతావరణంలోకి వెళ్తాయి.

ఈ సూక్ష్మ కణాలు మేఘాల్లోని నీటి ఆవిరికి అంటుకునే cloud condensation nucleiగా పనిచేయగలవు. సిద్ధాంతపరంగా, అలాంటి కణాలు నీటి బిందువులు ఏర్పడటానికి సహాయపడవచ్చు. కానీ ఇక్కడే కీలకమైన విషయం ఉంది. యాగంలో ఏర్పడే పొగలోని కణాలు వర్షాన్ని కురిపించేంత ప్రభావాన్ని చూపుతాయని చెప్పడానికి ప్రస్తుతం బలమైన శాస్త్రీయ ఆధారం లేదు.

మరి క్లౌడ్‌ సీడింగ్‌ కూడా ఇదే కదా?

కొంతవరకు పోలిక ఉంది. క్లౌడ్‌ సీడింగ్‌లో సిల్వర్‌ అయోడైడ్‌, ఉప్పు వంటి నిర్దిష్ట పదార్థాలను ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్న మేఘాల్లోకి పంపిస్తారు. లక్ష్యం మేఘాల్లోని నీటి బిందువులు/మంచు కణాల ఏర్పాటును ప్రోత్సహించడం.

కానీ యాగంలో వచ్చే పొగను క్లౌడ్‌ సీడింగ్‌తో సమానం చేయలేం. కానీ యాగంతో పాటు ప్రభుత్వాల నుంచి మరో లెక్క కూడా ఉండాలి.

వర్షాన్ని నిర్ణయించేది ఎవరు?

రుతుపవనాల కదలిక, అల్పపీడనాలు, వాయుగుండాలు, గాలుల దిశ, వాతావరణంలోని తేమ, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, ఎల్‌నినో, లా నినా వంటి అనేక అంశాలు వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే యాగం జరిగిన మరుసటి రోజే వర్షం పడితే.. అది తప్పనిసరిగా యాగం వల్లే అని చెప్పలేం.

మరి ప్రభుత్వాలు యాగాలు ఎందుకు చేస్తున్నాయి?

వర్షం అంటే రైతు పంట మాత్రమే కాదు. తాగునీరు, సాగునీరు, ప్రాజెక్టుల నిల్వలు, విద్యుత్‌ ఉత్పత్తి.. అన్నీ వర్షంపైనే ఆధారపడి ఉంటాయి. వర్షాభావ సమయంలో ప్రజల విశ్వాసాలకు దగ్గరగా ఉండే కార్యక్రమాలు నిర్వహించడం ఆధ్యాత్మికతతో పాటు ఒక సామాజిక, రాజకీయ సందేశంగా కూడా మారుతుంది.

వర్షం అసలు ఎలా పడుతుంది?

సూర్యుడి వేడితో సముద్రాలు, నదులు, చెరువులు, నేల నుంచి నీరు ఆవిరవుతుంది. ఆ నీటి ఆవిరి పైకి వెళ్లి చల్లబడుతుంది. చిన్న నీటి బిందువులు, మంచు కణాలుగా మారి మేఘాలను ఏర్పరుస్తాయి. తగినంత తేమ, ఉష్ణోగ్రత, గాలి కదలికలు, వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ బిందువులు పెద్దవై వర్షంగా భూమిపైకి పడతాయి.

భారతదేశంలో ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు, అల్పపీడనాలు, వాయుగుండాలు, గాలుల కదలికలు, తేమ వర్షపాతాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

యాగం–వర్షం.. లెక్క ఇదే!

1993లో యాగం జరిగింది.. ఆశించిన వర్షం రాలేదు.

2008, 2009లో యాగాలు జరిగాయి.. తర్వాత వర్షాలు వచ్చాయి.

2019లో తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.

2023లో టీటీడీ వరుణ యాగాలు నిర్వహించింది. అదే ఏడాది ఎల్‌నినో ప్రభావంపై ఆందోళనలు ఉన్నాయని టీటీడీ స్వయంగా పేర్కొంది.

2024లో భారీ వర్షాలు వచ్చాయి.. కానీ వాటికి వాతావరణ వ్యవస్థలే శాస్త్రీయ కారణంగా నమోదయ్యాయి. కాబట్టి చరిత్రను చూస్తే యాగం తర్వాత వర్షం అనే సందర్భాలు ఉన్నాయి. కానీ యాగం వల్లే వర్షం అనే శాస్త్రీయ నిర్ధారణ మాత్రం లేదు.

చెరువులు ఎన్ని పునరుద్ధరించారు? చెక్‌డ్యామ్‌లు ఎన్ని నిర్మించారు? వర్షపు నీటిని ఎంత నిల్వ చేస్తున్నారు? ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం ఎంత పెరిగింది? నీటి సంరక్షణకు ఎంత ఖర్చు చేస్తున్నారనే అంశంపై దృష్టి సారించాలి.

నాగార్జునసాగర్‌ నుంచి వచ్చే సందేశం ఏంటి?

ఇప్పుడు నాగార్జునసాగర్‌ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి వరుణ యాగంలో పాల్గొనడంతో పాత చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. కోట్ల విజయభాస్కరరెడ్డి నుంచి వైఎస్సార్‌ వరకు.. కేసీఆర్‌ నుంచి రేవంత్‌రెడ్డి వరకు.. మంత్రులు, ఆలయ నిర్వాహకుల వరకు వర్షం కోసం వరుణుడిని ప్రార్థించిన ఉదాహరణలు ఉన్నాయి.

కానీ వరుణుడిని ప్రార్థించడం ఒక వైపు..వచ్చిన వానను ఒడిసిపట్టడం మరో వైపు. రైతుకు కావాల్సింది రెండూ. వాన కోసం యాగం చేయడం విశ్వాసం. వచ్చిన వానను వృథా కాకుండా కాపాడడం పాలన. వచ్చిన ప్రతి చుక్కను రైతు పొలానికి ఎంత చేర్చారు అన్నదే అసలు లెక్క.

కొండవీటి శివనాగరాజు – డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9

Loading...
Unable to load recommendations.
Follow Us