AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూఢనమ్మకం చిదిమిన ప్రాణం.. మంత్రాల నెపంతో పూజారి దారుణ హత్య..!

మనుషులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా, గ్రామాల్లో ఇంకా వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి చంపి, మృతదేహాన్ని కాలువలో పడేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

మూఢనమ్మకం చిదిమిన ప్రాణం.. మంత్రాల నెపంతో పూజారి దారుణ హత్య..!
Priest Murder
Naresh Gollana
| Edited By: |

Updated on: Apr 23, 2026 | 10:59 AM

Share

మనుషులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నా, గ్రామాల్లో ఇంకా వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని అత్యంత దారుణంగా కొట్టి చంపి, మృతదేహాన్ని కాలువలో పడేసిన ఘటన మంచిర్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.

జైపూర్ మండలం బెజ్జాల గ్రామానికి చెందిన గుమ్ముల రాజం చేపలు పట్టుకుంటూ జీవనం సాగించేవాడు. ఆయన గోదావరి ఒడ్డున ఉన్న ఒక ఆలయంలో పూజారిగా పనిచేసేవాడు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఆలయాన్ని శుభ్రం చేసి పూజలు నిర్వహించడం ఆయన దినచర్య. అయితే, ఇదే గ్రామానికి చెందిన ఆయన దగ్గరి బంధువు గుమ్ముల వెంకటి కుటుంబానికి, రాజంకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. తమ కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్యానికి గురవ్వడానికి రాజం చేసే మంత్రాలే కారణమని వెంకటి కుటుంబం బలంగా నమ్మింది.

మంగళవారం (ఏప్రిల్ 22) సాయంత్రం రాజం ఎప్పటిలాగే పూజల కోసం ఆలయానికి వెళ్లాడు. రాత్రి అయినా ఆయన ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా, అది స్విచ్ఛాఫ్ అని వచ్చింది. బుధవారం తెల్లవారుజామున గోదావరి పరిసరాల్లో వెతకగా, అక్కడ రాజం ద్విచక్రవాహనం, రక్తపు మరకలు కనిపించాయి. అనుమానంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల ప్రాథమిక విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆలయం నుంచి వస్తున్న రాజంను వెంకటి కుటుంబ సభ్యులు అడ్డుకుని, బండరాళ్లతో తలపై మోది కిరాతకంగా చంపారని పోలీసులు తెలిపారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కొంతదూరం ఈడ్చుకెళ్లి, పార్వతీ బరాజ్ నీటి కాలువలో పడేసి తొక్కారని వెల్లడించారు. జైపూర్ సీఐ నవీన్, ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకోగా, వారు నేరాన్ని అంగీకరించారు.

రాజం మృతదేహం లభ్యం కావడంతో బెజ్జాల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు శవంతో నిందితుడి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు వారికి సర్దిచెప్పి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు రాజంకు భార్య మల్లీశ్వరి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మూఢనమ్మకాలతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బెజ్జాల గ్రామం నివురుగప్పిన నిప్పులా ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us