
తెలంగాణలో పట్టణాభివృద్ధికి మరింత వేగం.. కోర్ అర్బన్ రీజియన్‌లో సమగ్ర మార్పుల దిశగా అడుగులు.. అర్భన్ డెవలెప్‌మెంట్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్యం నుంచి ఫుడ్ సేఫ్టీ వరకు.. స్ట్రీట్ లైట్స్ నుంచి వాటర్ హార్వెస్టింగ్ వరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
తెలంగాణ పట్టణాల అభివృద్ధి విషయంలో అధికారులు వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్బన్ ఏరియాల డెవలప్‌మెంట్‌కు సంబంధించి సచివాలయంలో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి.. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా… తెలంగాణలోని నగరాల్లో శానిటేషన్, దోమల నివారణపై అధికారుల ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా.. మున్సిపల్ అధికారులు గుర్తించిన ప్రదేశాల్లోనే చెత్త వేసేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పనులు ఆలస్యం కాకుండా అవసరమైతే టెక్నాలజీ వినియోగించాలని, సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కారం జరిగేలా డ్యాష్‌బోర్డ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు. కోర్ అర్బన్ రీజియన్‌లోని అన్ని స్ట్రీట్ లైట్లకు ప్రత్యేక నంబర్లు కేటాయించి కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌తో అనుసంధానం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
మరోవైపు.. CURE పరిధిలో ఫుడ్ సేఫ్టీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు సీఎం రేవంత్‌రెడ్డి. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార నాణ్యత పర్యవేక్షణను పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. హోటళ్ల కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. తరచూ తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక మానిటరింగ్ వింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. హోటళ్లకు రేటింగ్, సర్టిఫికేషన్ విధానాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. వాణిజ్య సముదాయాలు, వ్యాపార సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ నిబంధనల అమలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా.. ఫైర్ సేఫ్టీ విషయంలో అడ్వాన్స్‌డ్ ఎక్విప్‌మెంట్ వినియోగించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
అలాగే.. హైదరాబాద్ నగరంలోని సిగ్నల్ జంక్షన్లు, సర్కిల్స్ దగ్గర వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని సంరక్షించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ముందుగా కొన్ని ప్రాంతాలను గుర్తించి పైలట్ ప్రాజెక్ట్‌గా అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు తెలిపారు. మొత్తంగా.. తెలంగాణలోని పట్టణాల అభివృద్ధిపై రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. నగరాల అభివృద్ధిలో పారదర్శకత, టెక్నాలజీ వినియోగం, ప్రజా ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..