
మునుగోడులో పోస్టర్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ప్రచారం జోరందుకుంటోంది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధంతో పాటు పోస్టర్ల వార్ నడుస్తోంది. రోజుకో మండలంలో పోస్టర్లు హల్‌చల్ చేస్తున్నాయి. సంక్షేమ పథకాలపైన సవాళ్ల యుద్ధం మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల కంటే ఏ ఒక్క రాష్ట్రమైనా ఎక్కువ పెన్షన్ ఇస్తుందా ? ఇస్తున్నామని చెప్పే దమ్ముందా రాజగోపాల్ అని పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ ప్రభుత్వం 2016 రూపాయిలు ఆసరా, ఒంటరి మహిళ పెన్షన్, 3016 దివ్యాంగుల పెన్షన్ ఇస్తోందని, బిజెపి పాలిత రాష్ట్రాలైన గుజరాత్, యూపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ తో పోలుస్తూ సవాల్ చేసిన పోస్టర్లు చండూరు పట్టణంలో వెలిశాయి.
ఇన్నాళ్లు కోమటిరెడ్డి రాజగోపాల్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు పడితే.. ఈమధ్య సడెన్‌గా రాజగోపాల్ అనుకూల పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురంలు రాజగోపాల్ అనుకూల పోస్టర్లతో నిండిపోయాయి. ఫలిస్తున్న రాజన్న రాజీనామా పేరుతో పోస్టర్లు అంటించారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ప్రజల కలలు నెరవేరుతున్నాయని… ప్రతి గ్రామానికి 20 లక్షల నిధులు వచ్చాయని పోస్టర్లు వేశారు. చౌటుప్పల్‌లో ఐదు డయాలసిస్ యూనిట్లతో పాటు హుటాహుటిన చేనేత బీమా ప్రకటించారంటూ పోస్టర్లలో రాశారు.
ఇంతకుముందు రాజగోపాల్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు హల్‌చల్ చేశాయి. ఫోన్ పే తరహా కాంట్రాక్ట్ పే ద్వారా 18 వేల కోట్ల ట్రానాక్షన్ రాజగోపాల్ ఖాతాలో జరిగిందంటూ పోస్టర్లు వెలిశాయి. రాజగోపాల్ రెడ్డికి 18 వేల కోట్లు కాంట్రాక్ట్ కేటాయించారంటూ వేల సంఖ్యలో షాపులు, గోడలకు రాత్రికే రాత్రి కొందరు అతికించారు మునుగోడు ప్రజలారా.. మేం మోసపోయాం.. మీరు మోసపోవద్దు.. ఇట్లు దుబ్బాక ప్రజలు అంటూ చౌటుప్పల్‌లో పోస్టర్లు వెలిశాయి. రోజుకో మండలంలో ఇలాంటి పోస్టర్లు కొందరు అతికించారు. వీటికి కౌంటర్‌గా ఇప్పుడు రాజగోపాల్ అనుకూల పోస్టర్లు దర్శనమిచ్చాయి. మొత్తానికి పోస్టర్ పాలిటిక్స్ మునుగోడులో హీట్ పుట్టిస్తున్నాయి.