ఒంటరిగా ఉన్నారా? అంటూ.. ఫోన్‌లో రాత్రి ఇలాంటి వీడియోస్ వస్తున్నాయా? తస్మాత్ జాగ్రత్త!

ఒంటరిగా ఉన్నారా..? ఇంకెందుకు ఆలస్యం.. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకోండి.. అంటూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఆకర్షణీయమైన యాడ్స్ వెనుక అసలు నిజం మాత్రం భయంకరం. ఇవి సరదా కోసం వచ్చిన ప్రకటనలు కావు.. సూటిగా డబ్బు, పరువు దోచేసే సైబర్ నేరగాళ్ల పన్నాగం. ఈ విషయంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ చేసిన హెచ్చరిక ఇప్పుడు యువతలో అప్రమత్తత అవసరాన్ని గుర్తుచేస్తోంది.

ఒంటరిగా ఉన్నారా? అంటూ.. ఫోన్‌లో రాత్రి ఇలాంటి వీడియోస్ వస్తున్నాయా? తస్మాత్ జాగ్రత్త!
Cybercrime Warning

Edited By:

Updated on: Mar 17, 2026 | 4:17 PM

రోజురోజుకే సైబర్ నేరగాళ్లు మితిమీరిపోతున్నారు. ఒకప్పుడు కేవలం వస్తువులను అడ్డుపెట్టుకుని డబ్బు లాగే స్థాయి నుంచి జనాలను ఎమోషన్స్‌తో ఆడుకునే స్థాయికి చేరుకున్నారు. యువత ఒంటరితనాన్ని లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు హనీట్రాప్ వల విసురుతూ అందినకాడికి దోచేస్తున్నారు. అందమైన అమ్మాయిలతో చాట్ చేయండి అంటూ సోషల్ మీడియాలో వీడియోలను వదులుతూ యువతను వలలో వేసుకుంటున్నారు.వీటిపై తాజాగా హైదరాబాద్‌ సీపీ కీలక హెచ్చరికలు జారీ చేశారు.

అవన్నీ నిజమైన వీడియోలు కాదని.. ఏఐ సాయంతో తయారుచేసిన ఫేక్ విజువల్స్ అని స్పష్టం చేశారు. నిజంగానే మనతో మాట్లాడే వ్యక్తుల్లా కనిపించడంతో చాలామంది మాయలో పడుతున్నారని.. ఈ యాడ్స్‌లో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న క్షణం నుంచి సమస్య మొదలవుతుందని తెలిపారు. ఆ యాప్ ద్వారా ఫోన్‌లోని కాంటాక్ట్స్, ఫోటోలు, వీడియోలు వంటి వ్యక్తిగత సమాచారం మొత్తం నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుందని సూచించారు. మనకు తెలియకుండానే ప్రైవసీ పూర్తిగా కోల్పోతామని హెచ్చరించారు

ఇక్కడితో మోసం ఆగదని.. రాత్రి వేళల్లో వీడియో కాల్ చేస్తూ అవతలి వైపు న్యూడ్ వీడియోలు ప్లే చేసి, స్క్రీన్‌పై కనిపిస్తున్న మన ముఖాన్ని రికార్డ్ చేస్తారు. తర్వాత ఆ వీడియోను మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి, మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి పంపిస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేస్తారు. ఈ విధానమే సెక్స్‌టార్షన్. “పరువు పోతుంది” అన్న భయంతో బాధితులు వారు అడిగినంత డబ్బు చెల్లిస్తూ పోతారు. ఒకసారి డబ్బు ఇవ్వడం మొదలైతే ఈ దోపిడీ ఆగదు. చివరకు బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే వరకు వేధింపులు కొనసాగుతాయి. ఈ మోసాలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి వేదికల్లో విస్తృతంగా కనిపిస్తున్నాయి.

ఆన్‌లైన్‌లో ఎవరూ ఊరికే స్నేహితులు కారు అన్న విషయం గుర్తుంచుకోవాలని సీపీ సజ్జనార్ చెబుతున్నారు. ఆ ఆకర్షణ వెనుక మీ డబ్బు, మీ పరువు లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద కుట్ర దాగి ఉంటుందని.. క్షణిక ఆసక్తితో తెలియని యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోవడం జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుందని సూచిస్తున్నారు. ఒకవేళ ఇప్పటికే ఇలాంటి సైబర్ వలలో చిక్కుకున్నా భయపడాల్సిన అవసరం లేదని.. వెంటనే 1930 నంబర్‌కు కాల్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచిస్తున్నారు. సమయానికి స్పందిస్తే నష్టం తగ్గించే అవకాశం ఉంటుందని సీపీ అంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us