హైదరాబాదీలకు అలర్ట్.. మీరు తినే ఉస్మానియా బిస్కెట్లలో విషం.. వెలుగులోకి భయంకర నిజాలు..

కల్తీ.. కల్తీ..కల్తీ..ఎటు చూసినా కల్తీయే.. ఏం తిందామన్నా కల్తీయే..మొన్నటికి మొన్న రెస్టారెంట్లలో ఫుడ్‌ కల్తీ భయాందోళనలు కలిగించింది.. ఆ తర్వాత సబ్బులు, డిటర్జెంట్లతో పాటు మస్కిటో రైఫిల్స్‌ కూడా కల్తీ అని తేలింది. ఐస్‌ క్రీమ్‌లు, చాక్లెట్లు కూడా కల్తీమయం అవుతున్నట్టు అధికారుల దాడుల్లో స్పష్టమైంది. తాజాగా ఉస్మానియా బిస్కెట్ల వంతు వచ్చింది.

హైదరాబాదీలకు అలర్ట్.. మీరు తినే ఉస్మానియా బిస్కెట్లలో విషం.. వెలుగులోకి భయంకర నిజాలు..
Police Raid On Hyderabad Osmania Biscuit Unit

Edited By:

Updated on: Mar 27, 2026 | 8:11 PM

హైదరాబాద్‌లో ఆహార భద్రతపై ఆందోళన కలిగించేలా మరో ఘటనవెలుగులోకి వచ్చింది. నగరంలోని అంబర్‌పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీపై పోలీసులు అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో బయటపడిన వివరాలు మరింత కలవరపెడుతున్నాయి. ఆవురావురుమని ఉస్మానియా బిస్కెట్లను తినే ఫుడ్‌ లవర్స్‌కి.. ఈ చేదునిజాలు భయపెట్టేలా ఉన్నాయి. బిస్కెట్లు చూడగానే ఆకర్షణీయంగా, మంచి రంగులో కనిపించడం కోసం సదరు ఫ్యాక్టరీ యాజమాన్యం ప్రాణాంతకమైన రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సాధారణ ఆహార రంగులకు బదులుగా, రకరకాల కెమికల్స్ కలిపి కొత్త రంగులు సృష్టిస్తున్నట్లు దాడుల్లో తేలింది. ఈ రసాయనాలు శరీరంలోకి వెళ్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కుళ్లిన గుడ్లు.. అపరిశుభ్ర వాతావరణం

అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే.. బిస్కెట్ల తయారీలో వాడే ముడి సరుకులో నాణ్యత మచ్చుకైనా లేదు. తక్కువ ధరకు వస్తున్నాయని కుళ్ళిపోయిన, పాడైన గుడ్లను యథేచ్ఛగా వాడుతున్నట్లు అధికారులు ఆధారాలతో సహా పట్టుకున్నారు. ఫ్యాక్టరీ లోపల కనీస పరిశుభ్రత పాటించకుండా, ఈగలు ముసురుతున్న మురికి వాతావరణంలో బిస్కెట్లను తయారు చేస్తున్నారు. మనం ఎంతో ఇష్టంగా తినే బిస్కెట్లు ఇంతటి నరకప్రాయమైన చోట తయారవుతున్నాయా అని అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేశారు.

యాజమాన్యంపై ఉచ్చు..

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ ఫ్యాక్టరీపై పోలీసులు కేసు నమోదు చేసి.. ఫ్యాక్టరీని సీజ్ చేశారు. యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన ఫుడ్ సేఫ్టీ విభాగం, నగరం నలుమూలలా ఉన్న మిగిలిన తినుబండారాల తయారీ కేంద్రాలపై కూడా నిఘా పెంచింది. బయట దొరికే ఆహార పదార్థాల విషయంలో వినియోగదారులు ఆచి తూచి వ్యవహరించాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బ్రాండెడ్ కాని, అపరిశుభ్ర ప్యాకింగ్‌లో ఉండే బిస్కెట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us