PM Modi: ఇవాళ తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

మూడోసారి పీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తెలంగాణ గడ్డపై అడుగుపెడుతున్నారు ప్రధాని మోదీ. ఒకవైపు వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో తెలంగాణ ప్రగతికి ఊతమిస్తూనే, మరోవైపు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసిగిపోయారు అని ఇప్పటికే మోదీ ట్వీట్ చేసి పొలిటికల్ హీట్ పెంచారు.

PM Modi: ఇవాళ తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
Pm Modi Telangana Visit

Updated on: May 10, 2026 | 7:00 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు ఐదు గంటల పాటు నగరంలో గడపనున్న ప్రధాని, వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

ప్రధాని పర్యటన షెడ్యూల్ ఇలా..

మధ్యాహ్నం 2:20 గంటలకు: ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

మధ్యాహ్నం 2:55 గంటలకు: మాదాపూర్‌లోని HICCకి చేరుకుని అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

సాయంత్రం 6:25 గంటలకు: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌‌కు చేరుకుంటారు.

రాత్రి 7:20 గంటలకు: పర్యటన ముగించుకుని తిరిగి గుజరాత్‌కు బయలుదేరుతారు.

రూ. 9,400 కోట్ల వరాల జల్లు

ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ పెద్దపీట వేశారు. సుమారు రూ.9,400 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మౌలిక సదుపాయాలు, రవాణా, ఇంధన రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. హైదరాబాద్-పనాజీ ఎకనమిక్ కారిడార్‌తో పాటు NH-167లో గుడెబెల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు 4 వరుసల రహదారి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. ఈ ప్రాజెక్ట్ విలువ 3,175 కోట్ల రూపాయలు అని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా. 2,360 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి శంకుస్థాపన చేస్తారు. ఇక 1,243 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ మూడో రైల్వే లైన్ ప్రారంభిస్తారు. వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్, హైదరాబాద్ మల్లాపూర్‌లో పెట్రోలియం టెర్మినల్ వంటి ప్రాజెక్టులు కూడా మోదీ షెడ్యూల్‌లో ఉన్నాయ్.

భారీ బహిరంగ సభ

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభపై బీజేపీ శ్రేణులు భారీ ఆశలు పెట్టుకున్నాయి. ఈ సభకు సుమారు 2 లక్షల మందిని తరలించాలని కమలం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని పర్యటన దృష్ట్యా నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించడమే కాకుండా, పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

రాజకీయ వేడి పెంచిన ప్రధాని ట్వీట్

తెలంగాణ పర్యటనకు ముందు ప్రధాని మోదీ చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు. మార్పు కోరుకుంటున్న జనం ఇప్పుడు బీజేపీ వైపు ఆశగా చూస్తున్నారు” అని ప్రధాని అన్నారు. కాగా ప్రధాని రాకతో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలుకానున్నాయి.

Follow Us