ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు.. ఎండాకాలం వేడిని మించి మండిపడుతున్నారు. పాలకుర్తిలో కోడలు పదవి…అత్త పెత్తనంపై తిరుగుబాటు చేస్తున్నారు. దేవరుప్పల మoడల పార్టీ అధ్యక్షుడు కృష్ణమూర్తిని తొలగించడంతో…ఈ కాక గాంధీభవన్‌కు చేరింది. వందలమంది పాలకుర్తి కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీభవన్ దగ్గర నిరసన కార్యక్రమాలతో హోరెత్తించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ దగ్గర శనివారం కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి , ఆమె అత్త ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా పాలకుర్తి నియోజక వర్గ కాంగ్రెస్ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎమ్మెల్యే యశిస్వినీ రెడ్డి పేరుకు మాత్రమే ఉన్నారు…పెత్తనమంతా ఆమె అత్తదే అంటూ ఝాన్సీరెడ్డి టార్గెట్‌గా మాటల తూటాలు, ఆరోపణల అస్త్రాలు సంధించారు కాంగ్రెస్ కార్యకర్తలు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి, వేరే పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్‌లో జాయిన్ అయిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పార్టీ అధ్యక్షుడ్ని ఏకపక్షంగా తొలగించారంటూ మండిపడ్డారు. 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న తనను తొలగించడానికి ఝాన్సీ రెడ్డి ఎవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణమూర్తి.
గాంధీభవన్‌లో కాక రేపిన పాలకుర్తి పంచాయితీ..ఇప్పుడు నియోజకవర్గ కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతోంది. ఎమ్మెల్యే కోడలు, పెత్తనం చలాయించే అత్త సమాధానం చెప్పాలంటోంది కాంగ్రెస్ కేడర్. ఈ గొడవకు ఎమ్మెల్యే యశస్విని, ఆమె అత్త ఝాన్సీ రెడ్డి.. ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..