
పోంజి స్కీమ్ కేసులో ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్(EOW) అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికీ ఈ కేసులో ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వేణుగోపాల్, వెంకట్రావు, శ్రేయాస్ పాల్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మాదాపూర్‌లో పలు ఫేక్ కంపెనీలు, నకిలీ వెబ్‌సైట్లను ప్రారంభించి అమాయకులను మోసం చేశారు. ప్రతినెల ఏడు శాతం.. ప్రతి ఏటా 84 శాతం వాటా ఉంటుందని అమాయకులను నమ్మించారు నిందితులు. దేశవ్యాప్తంగా 3 వేల 164 మందిని మోసం చేసి 850 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు నిందితులు.
వచ్చిన డబ్బులు అన్నింటినీ 21 మ్యూల్ ఖాతాల్లోకి బదిలీ చేశారు నిందితులు. పెట్టుబడి పెట్టిన వారికి స్టాక్ మార్కెట్‌లోనే ఉన్నట్లు చూపించారు. వచ్చిన సొమ్ముతో దుబాయ్‌లో మనీలాండరింగ్ పాల్పడినట్లు EOW అధికారులు గుర్తించారు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులతో అధిక లాభాలు వస్తాయని పోంజి స్కీమ్ పేరుతో 3 వేల 164 మందికి పైగా మోసం చేశారు. పుప్పాలగూడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదుతో బాగోతం బయటపడింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి బాధితుడు 23 లక్షలు పోగొట్టుకున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిందితుడు వేణుగోపాల్ మణికొండలో నివాసం ఉంటున్నాడు. ప్రధాన నగరాల్లో 20 మందికి పైగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నాడు. వేణుగోపాల్ తోపాటు వెంకట్రావు, శ్రేయస్ పాల్ కలసి ఈ దందా నిర్వహించినట్లు దర్యాప్తులో తేలింది. టెక్నికల్ డెవలపర్స్, వెబ్‌సైట్ అడ్మినిస్ట్రేటర్లు, వివిధ పేర్లతో నకిలీ వెబ్ సైట్లను క్రియేట్ చేసి భారీ మోసానికి పాల్పడ్డారు నిందితులు. ఏఐ టెక్నాలజీతో స్టాక్ మార్కెట్ గురించి ఏపీ, తెలంగాణలో సెమినార్స్ కూడా నిర్వహించారు. ఏవీ సొల్యూషన్‌లో కీలక ఉద్యోగిగా ఉన్నాడు నిందితుడు శ్రేయాస్ పాల్.
పెద్ద మొత్తంలో స్థిరాస్తి వ్యాపారాలు, బంగారం, ఖరీదైన కార్లు కొన్నారు నిందితులు. 2022 నుండి 2025 వరకు నకిలీ కంపెనీలు సృష్టించారు. AV సొల్యూషన్ పేరిట వేణుగోపాల్ 2 వేల 388 మందిని మోసం చేసి 442 కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు. ఐఐటి క్యాపిటల్ టెక్నాలజీ పేరిట వెంకట్రావు 778 మందిని మోసం చేసి 410 కోట్ల రూపాయలు కాజేశాడు. నిందితుల నుంచి విలువైన కార్లు, 11 ల్యాప్‌టాప్‌లు, మూడు ఫోన్లు, బాధితుల డేటాబేస్, బినామీ పేర్లతో ఉన్న ప్లాట్‌లను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏజెంట్లతో పాటు ఆస్తులపై కూడా ఫోకస్ పెట్టారు EOW అధికారులు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..