TGSRTC: డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..

డీజిల్ ధరలు పెరగడంతో టీజీఎస్‌ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. డీజిల్ ధరలు పెరగడం వల్ల ఆర్టీసీపై అదనపు భారం పడుతుంది. దీని వల్ల బస్సు టికెట్ ధరలును పెంచనున్నారనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఎట్టకేలకు ఆర్టీసీ వర్గాలు స్పందించాయి.

TGSRTC: డీజిల్ ధరల ఎఫెక్ట్.. ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు..? టీజీఎస్‌ఆర్టీసీ క్లారిటీ ఇదిగో..
Tgsrtc

Updated on: May 26, 2026 | 11:27 AM

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. కొద్దిరోజుల్లోనే నాలుగుసార్లు పెరగ్గా.. మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్‌పై రూ.7 మేర పెరిగింది. అయితే రూ.10 వరకు పెంచవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చమురు కంపెనీలు నష్టాల నుంచి బయట పడాలంటే పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. దీంతో త్వరలో ధరలను కేంద్రం పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. అయితే ధరల పెరుగుదలతో సామాన్యులపై భారం పడుతోంది. డీజిల్ ధరలు పెరగడంతో బస్సు ఛార్జీల ధరలను టీజీఎస్‌ఆర్టీసీ పెంచనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

పెంచేది లేదు..

డీజిల్ ధరల పెరుగుదలతో ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచనుందనే వార్తలపై టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి స్పందించారు. ప్రస్తుతానికి టికెట్ ధరలను పెంచే ఆలోచన లేదని, ఇప్పుడు ఎలాంటి మార్పులు చేయబోమని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి పాత ఛార్జీలు వర్తిస్తాయని, పెంపు ప్రతిపాదన ఏం లేదని తెలిపింది. భవిష్యత్తులో పరిస్థితులు చక్కబడి ఇంధన ధరలు స్దిరపడ్డాక అప్పుడు ధరలను సవరించే ఆలోచన చేస్తామని అన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి ఛార్జీలను సవరించడంపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే డీజిల్ ధరల పెరుగుదల వల్ల ఆర్టీసీపై భారం పడుతున్నా.. ప్రస్తుతానికి ఛార్జీలను పెంచడంపై ఎలాంటి నిర్ణయం ఆర్టీసీ వర్గాలు తీసుకోవడం లేదు. ఇది సామాన్యులకు ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు.

ఆర్టీసీకి ఎంత నష్టం..?

ఇప్పటివరకు లీటర్ డీజిల్‌పై రూ.6 పెరిగింది. ఒక్క రూపాయి పెరిగినా సంస్థపై నెలకు రూ.1 కోటి 28 లక్షల అదనపు భారం పడుతుంది. ప్రస్తుతం రూ.6 పెరగడంతో ప్రతీ నెలా రూ.7.68 కోట్ల భారం పడనుంది. మొత్తం 10 వేల బస్సులు తిరుగుతుండగా.. ప్రతి రోజు 6 లక్షల లీటర్ల డీజిల్ అవసరం అవుతుంది. దీంతో నెలకు 1.80 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రోజుకు రూ.36 లక్షల అదనపు భారం సంస్థపై పడనుంది. ఒకవేళ రద్దీ పెరిగి డీజిల్ వినియోగం పెరిగితే రూ.10 కోట్లకుపైగా భారం పడనుంది. ప్రస్తుతం ఈ నష్టాన్ని ఆర్టీసీనే భరిస్తుంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఇప్పుడు ఛార్జీలను పెంచి ప్రజలపై మరో భారం వేసేందుకు ఆర్టీసీ సిద్దపడటం లేదన చెప్పవచ్చు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us