Kuntala WaterFalls: పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే కుంటాల జలపాతం డేంజర్‌గా మారింది. మహోగ్రరూపం దాల్చిన జలపాతం వైపు ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు పోలీసులు. తెలంగాణలో రెండు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. కుండపోత వానలతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. వరద నీరు ముంచెత్తడంతో రాష్ట్రంలో పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ఇన్‌ఫ్లోతో పలు ప్రాజెక్టులు నిండుకుండలా మారగా, వాగులు వంకలు డేంజర్‌గా మారాయ్. ఉధృతంగా ప్రవహిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయ్. మరోవైపు.. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో కుంటాల జలపాతానికి వరద నీరు పోటెత్తుతోంది. కుంటాల జలహోరు కిలోమీటర్ వరకు వినిపిస్తూ భయపెడుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కుంటాల జలపాతం ఉగ్రూపం దాల్చింది.
ప్రముఖ పర్యాటక కేంద్రాలైన జలపాతాలకు వరద నీరు పోటెత్తడంతో ముందుజాగ్రత్తలు చేపట్టారు పోలీసులు. కుంటాల జలపాతం వైపు పర్యాటకులు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. కుంటాల వాటర్‌ఫాల్స్ వైపు నో ఎంట్రీ బోర్డులు పెట్టారు. జలహోరుతో సందడి చేస్తోన్న కుంటాల జలపాతాన్ని చూసేందుకు తరలివస్తున్న ప్రజలను రోడ్డుపైనే ఆపేస్తున్నారు పోలీసులు. ప్రమాదకరంగా మారిన జలపాతం వైపు ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నారు. కుంటాల మెయిన్ గేట్ దగ్గరే పర్యాటకులను నిలిపివేసి వెనక్కి పంపుతున్నారు అటవీ అధికారులు.