మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ముస్లిం కుటుంబం.. స్వాములకు అన్నదానం చేసి..

అయ్యప్ప స్వాములకు హిందువులు భిక్ష సమర్పించడం సాధారణమే. కానీ మతాలకతీతంగా ఇంట్లోనే ఏకంగా పరమత పూజలు, అన్నదానం చేసి మతసామరస్యాన్ని చాటింది ఓ ముస్లిం కుటుంబం. మతాలు వేరైనా మనమంతా ఒక్కటేనని ముస్లిం కుటుంబం అంటోంది. అయ్యప్ప మాలాధారులకు ఆ ముస్లిం కుటుంబం భిక్ష ఏర్పాటు చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. హిందూ- ముస్లిం ఐక్యతా రాగానికి ఆ ముస్లింల ఇల్లు వేదికైంది. మతసామరస్యానికి స్ఫూర్తిగా నిలిచిన ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన ముస్లిం కుటుంబం.. స్వాములకు అన్నదానం చేసి..
Representative Image

Edited By:

Updated on: Nov 18, 2025 | 8:08 PM

ప్రపంచంలో పరమత సహనానికి పెట్టింది పేరు భారతదేశం. హిందూ – ముస్లిం భాయ్ భాయ్ అంటూ మత సామరస్యానికి పెద్దపీట వేస్తూ సహజీవనం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలోని ముస్లిం కుటుంబం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ షేక్ సలీమాబేగం చిన్న కుమారుడు షేక్ ఆలీపాషా, ఆశా దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు మున్నా, రిజ్వానా ఉన్నారు. రాజకీయ కుటుంబం కావడంతో గ్రామంలో అన్ని వర్గాలతో సామరస్యంగా కలిసిమెలిసి ఉంటోంది.
గ్రామానికి చెందిన 60 మంది అయ్యప్ప దీక్షను స్వీకరించారు. వీరంతా అయ్యప్ప మాలధారణతో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఉదయం, సాయంత్రం నిత్యపూజలు చేస్తున్నారు. గ్రామంలోని కొందరు హిందువులు అయ్యప్ప మాలధారణ స్వాములకు అన్నదానం నిర్వహించారు. కానీ మాజీ సర్పంచి సలీమా బేగం చిన్న కొడుకు అలీపాషా కుటుంబం.. అయ్యప్ప మాలధారులకు తన ఇంటిలో భిక్షను ఏర్పాటుచేసి.. ఇతర మతాలపై తమకున్న గౌరవాన్ని చాటుకున్నారు.

స్వాములను తన నివాసానికి ఆహ్వానించి.. అన్నదానం చేశారు. అలీ పాషా ఇంట్లోనే ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గణపతి పూజ, సుబ్రహ్మ ణ్య, అయ్యప్ప, శివ, వెంకటేశ్వరస్వామి పూజలు నిర్వహించారు. అలీపాషా కుటుంబమే స్వయంగా వంటకాలు తయారు చేయించి.. భక్తితో వారికి వడ్డించారు. తమ ఇంట్లోనే ఏకంగా పరమత పూజలు, అన్నదానం చేసి మత సామరస్యాన్ని చాటింది. భిక్షను స్వీకరించి అయ్యప్ప స్వాములు అలీపాషా కుటుంబాన్ని ఆశీర్వదించారు. హిందూ- ముస్లిం భాయ్‌ భాయ్‌” అన్న నినాదాన్ని నిజం చేసి ఇతరులకూ స్ఫూర్తిగా నిలిచింది అలీ పాషా కుటుంబం. అన్ని మతాల సారం ఒక్కటేనని.. అన్ని మతాలను గౌరవించుకోవడం మన సంప్రదాయమని అలీ పాషా చెబుతున్నారు.

Follow Us