Telangana: దారుణం.. రెండేళ్ల కూతురిని చంపి.. లవర్‌తో పారిపోయిన కసాయి తల్లి..

అమ్మతనానికే ఓ మహిళ మచ్చ తెచ్చింది. ప్రియుడి కోసం కన్న కూతురినే చంపేసింది. మానవత్వం సిగ్గుపడే ఈ ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. పోలీసుల విచారణతో అసలు ఏం జరిగింది అనేది బయటకొచ్చింది. అసలు విషయం తెలిసి గ్రామస్థుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నిందితురాలిని ఉరితీయాలని డిమాండ్ చేశారు.

Telangana: దారుణం.. రెండేళ్ల కూతురిని చంపి.. లవర్‌తో పారిపోయిన కసాయి తల్లి..
Telangana Mother Kills Daughter

Edited By: Krishna S

Updated on: Sep 13, 2025 | 2:18 PM

వివాహేతర సంబంధాలు మనుషులను రాక్షసులుగా మారుస్తున్నాయి. కన్నవాళ్ళను, కన్న పిల్లలను కూడా చంపుతున్నాయి. ఇలాంటి దారుణమైన సంఘటన ఒకటి మెదక్ జిల్లాలో జరిగింది. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని ఓ కసాయి తల్లి రెండేళ్ల కూతురిని అత్యంత క్రూరంగా చంపేసింది. ఈ దారుణం మెదక్ జిల్లా శివ్వంపేట మండలం శభాష్‌పల్లిలో జరిగింది. భర్తతో గొడవపడి మమత పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన ఫయాజ్‌తో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. తమ అక్రమ సంబంధానికి పాప అడ్డుగా ఉందని భావించి, ఇద్దరూ కలిసి చిన్నారి గొంతు నులిమి చంపేశారు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా గ్రామ శివారులోని వాగు దగ్గర పాప మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.

ఈ క్రమంలో ప్రియుడితో కలిసి వేరే చోటుకి మకాం మార్చింది. అయితే పాప, భార్య కనిపించకపోవడంతో మమత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, మమత ఆమె ప్రియుడు ఫయాజ్‌ను గుంటూరులో పట్టుకున్నారు. పోలీసులు విచారణలో మమత అసలు నిజం బయటపెట్టింది. అక్రమ సంబంధం కోసమే కూతురిని చంపినట్లు ఆమె ఒప్పుకుంది. మమత ఇచ్చిన సమాచారం ఆధారంగా, పోలీసులు ఇద్దరినీ సంఘటనా స్థలానికి తీసుకువచ్చి, జేసీబీతో తవ్వకాలు జరిపి పాప మృతదేహాన్ని వెలికితీశారు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. తల్లి మమతను కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కన్న కూతురిని చంపుకోవడానికి కూడా వెనుకాడని మమత చర్య అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..