బంగాళాఖాతంలో అల్పపీడన సూచనలు.. మళ్లీ చురుకుగా రుతుపవనాలు!

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ బంగాళాఖాతం వైపు కదులుతుండటంతో నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఒడిశా, బెంగాల్ తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో వర్షాలు పెరిగి పరిస్థితుల్లో మార్పు రావచ్చని అంచనా వేస్తున్నారు..

బంగాళాఖాతంలో అల్పపీడన సూచనలు.. మళ్లీ చురుకుగా రుతుపవనాలు!
Bay Of Bengal Low Pressure

Updated on: Jul 15, 2026 | 9:00 AM

హైదరాబాద్‌, జూలై 15: పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన వాతావరణ వ్యవస్థ ప్రస్తుతం బంగాళాఖాతం వైపు పయనిస్తున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఇటీవల బలహీనపడిన నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో సముద్రపు గాలులు బలపడటంతో దట్టమైన మేఘాలు ఏర్పడి, రానున్న రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. ఈ అల్పపీడనం క్రమంగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు కదులుతూ తూర్పు భారతదేశంలో విస్తృత వర్షాలకు కారణమవుతుందని అధికారులు పేర్కొన్నారు. జూలై మొదటి వారంలో దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ, ఆ తర్వాత రుతుపవనాల్లో స్తబ్ధత నెలకొని వర్షపాతం గణనీయంగా తగ్గిపోయింది. ఫలితంగా అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి ఎండ తీవ్రత అధికమైంది.

ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో చోటుచేసుకుంటున్న తాజా వాతావరణ మార్పులు ఉపశమనం కలిగించే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా తెలంగాణ ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. నేటి నుంచి ప్రారంభమయ్యే వర్షాలు గురువారం నాటికి మరింత జోరందుకుని జూలై 19 వరకు కొనసాగవచ్చని అంచనా వేశారు. అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మరో వారం రోజుల పాటు గణనీయమైన వర్షాలు కురిసే సూచనలు కనిపించడం లేదని కూడా అధికారులు పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితులతో ఎండలు మళ్లీ వేసవిని తలపిస్తున్నాయి. దీంతో కొద్దిరోజులుగా వినియోగం తగ్గిన కూలర్లు, ఫ్యాన్లు మళ్లీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తున్నాయి.

మంగళవారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత మహబూబ్‌నగర్‌లో నమోదైంది. అక్కడ సాధారణం కంటే 6.9 డిగ్రీల సెల్సియస్ అధికంగా 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 35.6 డిగ్రీలు, ఖమ్మంలో 36.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక జూన్ 1 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో 214.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, కేవలం 154 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీంతో రాష్ట్రంలో వర్షపాతం లోటు 28 శాతానికి చేరుకుంది. రానున్న రోజుల్లో బంగాళాఖాతంలో ఏర్పడే వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఈ లోటు కొంత మేర భర్తీ అయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

Follow Us