
ప్రేమ,పెళ్లి అంటూ పోకిరి పెట్టిన వేధింపులతో ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. కల్లూరు మండలం పేరువంచ గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికను ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. అదే గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు ప్రేమ, పెళ్లి పేరుతో ఆ యువతిని కొన్ని రోజులుగా అసభ్యకర సైగలతో వేధించాడు. ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక.. తమ కుమార్తె మానసికంగా కుంగిపోయి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఆమె కుటుంబసభ్యులు అన్నారు.
ఆ యువకుడిపై మైనర్ బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఐటీఐ చదివి రెండేళ్లుగా ఖాళీగా తిరుగుతున్న అనిల్ అనే యువకుడు యువతితో పరిచయం పెంచుకొని.. రెండు రోజుల క్రితం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు. తల్లిదండ్రులు అడ్డుకుని యువకుడిని మందలించారు. ప్రేమ పేరుతో వేధింపులకు పాల్పడిన యువకుడిపై ఫోక్సో, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.