Telangana Govt: ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా శుక్రవారం నాడు ఉన్నత విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభంపై కీలక సూచనలు చేశారు. డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిలో 50శాతం విద్యార్థులకు మాత్రమే అనుమతి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతి కళాశాలలో తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇక నిత్యం శానిటైజేషన్ కోసం ప్రతి యూనివర్సిటీకి రూ.20 లక్షలు తక్షణ సాయంగా అందించాలని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డిని ఆమె ఆదేశించారు. కళాశాలల్లో విద్యార్థులు గుమికూడకుండా చూడాల్సిన బాధ్యత విద్యాసంస్థల యాజమాన్యాలకు ఉందన్నారు. అలాగే విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చూడాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాలదే అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. కాగా, ఈ సమీక్షా సమావేశంలో ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరావు, ఇతర అధికారులు హాజరయ్యారు.
Also read:
Corona Virus: పురుషులు జాగ్రత్త… కరోనా సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుందంట..
హైవేపై కారు నడిపిన ఐదేళ్ల బాలుడు.. వీడియో చూసి నెటిజన్ల ఆగ్రహం.. తల్లిదండ్రులపై చర్యలకు డిమాండ్