
నాలుగైదు రోజులుగు కురుస్తున్న వర్షాలతో తెలంగాణలోని వాగులు,వంకలు పొంగిపొర్లుతున్నాయి. అన్ని ప్రాంతాల్లోని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. సిరిసిల్ల జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలోని జనాలను దగ్గర్లో గల గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు తరలించి, అన్ని వసతులు కల్పించాలని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, ఎవరైనా వరదల్లో చిక్కుకున్నట్లు తెలిస్తే వెంటనే రిస్క్యూ చేసే విధంగా అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. అయా జిల్లా పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ ఆదేశించారు. వర్షాల కారణంగా దెబ్బ తిన్న రోడ్లను వెంటనే పునరుద్దరించేలా ఆర్అండ్ బీ, పంచాయతీ రాజ్ అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు మంత్రి కేటీఆర్. అటు వరద ఉధృతి ఎక్కువగా ఉన్న అనంతగిరిపై ఎమ్మెల్యే రసమయికి పోన్ చేసి అడిగి తెలుసుకున్న మంత్రి కేటీఆర్. ముంపుకు గురైన ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాలను పెట్టి నీటిని బయటకి పంపే ఏర్పాట్లు జిల్లా యంత్రంగం చేయాలని కేటీఆర్ ఆదేశించారు.